ఢిల్లీ: వయనాడ్ పార్లమెంట్ స్థానంలో ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ వారసత్వ రాజకీయలకు తెరలేపిందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ద్రోహం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు.
” కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ప్రజల మీద ఒక నేత తర్వాత మరో నేతను రుద్దుతూ వారసత్వ రాజకీయాలు చేస్తోంది. రాహుల్ గాంధీ మరో స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయం దాచిపెట్టడం సిగ్గుచేటు. ఈ విధానాల వల్లే రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన ఎన్నికల్లో ఓడిపోయింది” అని ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. బీజేపీ నేత చేసిన విమర్శలకు కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చింది.
”2014లో వారణాసి నుంచి కూడా పోటీ చేసిన నరేంద్ర మోదీ.. వడోదర ఓటర్ల వద్ద దాచిపెట్టటం సిగ్గుచేటు కాదా?” అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ‘ఎక్స్’లో కౌంటర్ వేశారు.
2014లో వడోదర, వారణాసి రెండు స్థానాల్లో మోదీ పోటీ చేసి గెలుపొందారు. ఆయన వడోదర స్థానాన్ని వదలుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ సైతం వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వాయనాడ్ స్థానాన్ని వదులుకోవటంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీని పోటీకి దింపింది. అయితే ఇదే మొదటి ప్రత్యక్ష ఎన్నికల పోటీ కావాటం గమనార్హం.
వాయనాడ్ నుంచి ప్రియంకాను బరిలోకి దించిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. కాంగ్రెస్ వారస్వత రాజకీయాలకు ఇదే అసలైన నిదర్శనం అంటూ మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కాదు.. ఫ్యామిలీ కంపెని అని సెటైర్లు వేస్తోంది.