దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 23,402కు చేరింది. సెన్సెక్స్ 334 పాయింట్లు ఎగబాకి 77,015 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.9 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.36 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం, నాస్డాక్ 0.25 శాతం నష్టపోయాయి.
ఫెడ్ సమావేశమే కీలకం..
అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25-5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలిరేట్ల తగ్గింపు సెప్టెంబర్లోనా..? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి.
దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో 4.8 శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.