ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది.
ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.
ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శక్తిమంతమైన సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ చర్యలకు తక్షణమే అడ్డుకట్టవేయకపోతే ఇదివరకు చూడని విధంగా స్పందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. సియోల్ గతంలోనూ ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలు, కే-పాప్ పాటలు, అంతర్జాతీయ వార్తలను వినిపించేందుకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించింది. 2015లోనూ ఇలాగే చేయగా.. కిమ్ సర్కారు ఫిరంగి గుండ్లు పేల్చింది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులే ఎదురైతే దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.
కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.