అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయమై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు.
వైకాపా కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం క్యాడర్‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి.. ఎలాంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.