అధికారం కట్టబెడితే పరిపాలన ఎవరైనా చేస్తారు. కానీ అధికారంలోకి రావడమే అసలుసిసలు పరీక్ష. ఆ పరీక్షను కొణిదెల ఫ్యామిలీ నుంచి ముందుగా చిరంజీవి ఎదుర్కొన్నా..
ఆ తరువాత ఆయన కాడి కింద పడేశారు. అయితే తాజా ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. అన్న చిరంజీవి వదిలేసిన పనిని.. తమ్ముడు పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడా.. అన్న వ్యాఖ్యలు వినిపిస్తుండడం విశేషం. ఈ ఎన్నికల ద్వారా పవన్ కళ్యాణ్ అందరి అంచనాలనూ తల్లకిందులు చేశాడంటున్నారు రాజకీయ పరిశీలకులు.
పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ ఒక్కసారిగా మారిపోయింది. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, మేధావులు, ప్రొఫెషనల్ రాజకీయ వేత్తలు సైతం.. పవన్ వ్యవహార శైలిని చూసి రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా కామెంట్లు చేశారు. రాజకీయాలకు పనికి రాని వ్యక్తిగా ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే… ఆ కామెంట్లు చేసిన వ్యక్తులంతా ఇప్పుడు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి తయారైంది.
తాజా ఎన్నికల్లో కూటమి కోసం తహతహలాడి.. బీజేపీని, టీడీపీని ఒక్క దగ్గరకు చేర్చడంలో సక్సెస్ అయిన వ్యక్తిగా.. ఈ విజయానికి భూమిక పోషించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక పాత్రలో ఒదిగిపోయారంటున్నారు పరిశీలకులు. ఈ కూటమి సక్సెస్ కావడానికి తాను సీట్ల సంఖ్యను కూడా తగ్గించుకోవడం గమనించాలంటున్నారు రాజకీయ నిపుణులు. 24 సీట్ల నుంచి 21 సీట్లు తగ్గించుకొని.. ఎంపీ సీట్లను కూడా మూడు నుంచి రెండుకు కుదించుకొని.. బీజేపీ-టీడీపీ అవగాహనకు పునాది వేశారు పవన్ కళ్యాణ్.
చంద్రబాబునాయుడుతో పొత్తు కుదరడం అయ్యేపని కాదని భావించిన బీజేపీ నేతలను సైతం.. ఒప్పించి, మెప్పించి రెండు పార్టీలతోనే ఆగిపోతుందనుకున్న కూటమిని.. ముచ్చటగా 3 పార్టీలకు చేర్చారు. బీజేపీ 10 సీట్లకు పోటీ చేస్తే 8 సీట్లలో గెలిచింది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన టీడీపీ అప్రతిహతంగా దూసుకుపోయి.. ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. ఈ పరిణామాలన్నింటిలోనూ పవన్ కళ్యాణ్ కేంద్రబిందువుగా వ్యవహరించడమే ఏపీ రాజకీయాల్లో మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ చొరవ కారణంగా.. ఏపీలో పవర్ కుర్చీ జగన్ నుంచి కూటమికి లభించింది. మరోవైపు ఏపీలో కొణిదెల ఫ్యామిలీకి పవన్ కారణంగా అరుదైన గౌరవం కూడా లభించిందంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆనాటి ఉమ్మడి ప్రాంత తెలుగు ప్రజల అంచనాలను ఒక్కసారిగా ఎంతగా పెంచారో.. ఎన్నికల తరువాత.. తాను అనుకున్న సీట్లు రాలేదన్న ఏకైక కారణంతో నీరుగారి పోయారు చిరంజీవి. ఫలితంగా రెండేళ్లు తిరక్కుండానే కాంగ్రెస్ లో విలీనం చేసి.. సినీ నటులు రాజకీయాలకు ఫిట్ కారన్న ముద్ర వేసుకున్నారు చిరంజీవి.
అయితే తాను రాజకీయాలకు సూట్ కానన్న అభిప్రాయంతోనే చిరంజీవి అలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం సోదరుడు తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. ఆ తరువాత ఎన్నికల నాటికే జనసేన పార్టీని స్థాపించినా 2014లో పార్టీ అభ్యర్థులను నిలుపకుండా ఎన్డీయేకు మద్దతిచ్చింది జనసేన. ఆ తరువాత 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి తీవ్రమైన ఎదురుదెబ్బ తిన్నారు పవన్.
పార్టీ అధినేత అయ్యుండీ తాను ఓటమిపాలవడంపై రాజకీయ శత్రువులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్లో ఆవేశమే తప్ప.. ఆలోచన ఏకోశానా లేదని, అస్సలు రాజకీయాలకు పనికి రాడని అంతా అదేపనిగా విమర్శలు చేశారు. అయితే పవన్ అప్పుడప్పుడూ తీవ్రంగా స్పందించినా.. రాజకీయపరమైన వ్యూహాలకు మాత్రం మరింత సీరియస్ గా, మరింత ఫోకస్డ్ గా పదునుపెడుతూ వచ్చారు. దాని ఫలితమే.. ఏపీలో నేటి కూటమి విజయంగా సాక్షాత్కరించింది. ఈ ఒక్క విజయమే పవన్లోని రేపటి రాజకీయ నాయకుడిని తీర్చిదిద్దుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకు తగినట్టుగానే పవన్ ఏమన్నారో ఓసారి వినండి.
చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అపఖ్యాతి మూట గట్టుకోవడం ఒక ఎత్తయితే.. చిరంజీవి తానుగా సక్సెస్ కాకపోయినా.. తమ్ముడి సక్సెస్ ను మాత్రం బలంగా కోరుకోవడం విశేషం. తన తమ్ముడిలో రాజకీయాలు లేవని.. నీతి, నిజాయతీ, చిత్తశుద్ధి, దేశభక్తి అనేవి పుష్కలంగా ఉన్నాయని చిరంజీవి ఎంతో సెంటిమెంట్ గా చెప్పుకోవడం.. పవన్ కు ఓ సర్టిఫికెట్ గా పనికొచ్చింది. పవన్ కు ఒక అవకాశం ఇవ్వాలని.. కచ్చితంగా మేలు జరుగుతుందని.. అవినీతి, అక్రమాల వంటికి అస్సలు తావు ఉండదని సోదరుడి గురించి చిరంజీవి చెప్పడం హైలైట్ గా మారింది. ఆ విధంగా తాను చేయని పనిని తమ్ముడి ద్వారా పూర్తయితే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుందీ అన్న భావన చిరంజీవిలో పుష్కలంగా వ్యక్తమైంది. మరోవైపు.. అన్న వదిలేసిన పనిని కొణిదెల వారసుడిగా పవన్ పూర్తి చేసి.. తన కుటుంబానికి వచ్చిన నెగెటివ్ రిమార్క్ ను పటాపంచలు చేశాడంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి కొణిదెల కుటుంబం నుంచి పవన్ రూపంలో ఓ సరికొత్త రాజకీయ నాయకుడు.. ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయడం ఖాయమన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి.