బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య జిల్లా అధికారులను ఆదేశించారు.
కలుషిత నీటి వల్ల అతిసార, ఇతర రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. మైసూరు జిల్లాలో తాజాగా ఓ వ్యక్తి కలుషిత నీటిని సేవించడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు. వరుణ నియోజకవర్గం, చాముండేశ్వరి సెగ్మెంట్లలో కలరా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ కమీషనర్లు, జిల్లా పంచాయతీ సీఈవోలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన మంచి నీటిని, తాగు నీటిని అందించాలని జిల్లా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమీషనర్లు తగిన చర్యలు తీసుకుని నీటిని ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేయాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. గ్రామం ఎంత పెద్దగా ఉన్నా.. ప్రతి రోజు తాగునీటిని పరీక్షించాలన్నారు. ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా జిల్లా అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. ఎక్కడ కేసులు నమోదు అయినా అక్కడ అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. వారిని సస్పెండ్ చేస్తామన్నారు. మైసూరు ఘటనలో అధికారులు నిర్లక్ష్యం ఉందని, వాటర్‌ను టెస్టింగ్ చేయకుండా విడుదల చేయడం సరికాదు అన్నారు.