అజర్బైజాన్ సరిహద్దు సమీపంలో మే 19న హెలికాఫ్టర్ కుప్పకూలి ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మరణించారు. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు.
ఆ తర్వాత ఇరాన్ లోని తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ప్రమాదంలో(Chopper crash) ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi),ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్ చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ సోమవారం తెలిపింది. అయితే హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు వార్తలు రాగానే ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘X’లో..#mossad ట్రెండింగ్ లో ఉంది.
ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొసాద్(Mossad)’,ఇరాన్ ఇంటెలిజెన్సీ హస్తం ఉందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని,ఖచ్చితంగా మొసాద్ స్కెచ్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. ఇటీవల, ఇరాన్.. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. డమాస్కస్ లోని తమ దేశ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఉన్నతాధికారులను చంపిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ పై ఈ దాడులకు దిగింది ఇరాన్. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడి మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
63 ఏళ్ల ఇబ్రహీం రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలుత 2017 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన రైసీ.. హసన్ రౌహానీ చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత 2019లో న్యాయ వ్యవస్థ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి 2021 ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా రైసీనీ భావించేవారు.