Bangalore Rave Party: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లో ఓ రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.
హైదరాబాద్‌కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లు తెలిసింది. దీనిపై దాడి చేసిన పోలీసులు.. 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో 25 మంది దాకా టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. పోలీసులకు దొరికిపోయిన వారిలో.. సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ కూడా ఉన్నట్లు తెలిసింది.
ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొన్నానని వస్తున్న ఆరోపణలను ఖండించిన నటి హేమ.. తాను పాల్గొనలేదని తెలిపారు.
జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు సంబంధం లేదన్నారు. కారుపై ఉన్న స్టిక్కర్ నిజమైనదో కాదో పోలీసులు తేల్చుతారన్నారు.
ఘటనా స్థలంలో 15కి పైగా విలువైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీ కోసం ఇందులో పాల్గొనేవారిని విమానంలో బెంగళూరుకి తరలించినట్లు తెలిసింది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.