సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరో మూడు విడతల్లో ఎన్నికల ప్రహసనం ముగియ నుంది. ప్రచారంలో నేతలు పరస్పర ఆరోపణలు, నిందలు వేసుకుంటున్నారు. కానీ ఎక్కడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగడం లేదు. అధికార బిజెపి ఈ విషయంలో ముందున్నది. ఎక్కడా పెరుగుతున్న ధరల గురించి గానీ, నిరుద్యోగం, జిఎస్టీ భారం తదితర అంశాలను ప్రస్తావించడం లేదు. ప్రభుత్వరంగ సంస్థ అమ్మకాలపైనా ఇప్పుడు మాట్లాడడం లేదు. అందరినీ వంచించి, కాంగ్రెస్‌ను తిడుతూ మోడీ ద్వయం కాలక్షేప ప్రచారాలు చేస్తున్నారు. వారి ప్రచారానికి ప్రజలు ఓట్లేస్తారు. మోడీ హ్యాట్రిక్ సాధిస్తారు. కానీ మోడీ గెలిచినా..ఓడేది మాత్రం ప్రజలే అని గుర్తించాలి. ఈ క్రమంలో గతంలో స్విస్ బ్యాంక్‌లో దాచిన నల్లడబ్బు ను తెచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తామని అన్నారు. ఏటా కోటి ఉద్యోగాలని అన్నారు.అలాగే ధరలను అదుపు చేస్తామని అన్నారు. అలాగే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, వ్యవసాయాన్ని పండగ చేస్తామని అన్నారు. ఇవేవీ అమలు కాలేదు. అడిగితే సమాధానం లేదు. అయినా ప్రజలు అడగలేక పోతున్నారు. తాజాగా మోడీ మరో ప్రకటన చేశారు. అవినీతి కేసులకు సంబంధించి ఈడీ స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలపై ప్రధాన మంత్రి మోడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సొమ్మంతా పేదలకే పంచిపెడతామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నానన్నారు. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరుతామన్నారు. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని, ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరామని ప్రధాని వెల్లడిరచారు. నిజంగా ఇంతకన్నా వంచన మరోటి ఉంటుందా..నిజానికి ఇది పట్టుబడ్డ డబ్బు. ప్రభుత్వానికి ప్రజలు రక్తం చిందించి జిఎస్టీ రూపంలో కడుతున్న డబ్బు గురించి మాట్లాడడం లేదు. మోడీ నిర్ణయాల కారణంగా నిర్మాణ రంగం కుదేలయ్యింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక్క ఫ్లాట్ కొనాలంటే కోటి రూపాయలు కావాలి. దానికి 5శాతం జిఎస్టీ అంటే 5 లక్షలు కట్టాలి. స్టీలు, సిమెంట్ ధరలు ఆకాశం వైపు దూసుకుని వెళుతున్నా అడ్డుకోవడం లేదు. కందిపప్పు 175 రూపాయాలకు కిలో అయ్యింది. పెసరపప్పు 150గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ధరలు దాడులు చేస్తున్నారు. అయినా ఈ విషయాలను ప్రధాని ఎక్కడా ప్రస్తావించడం లేదు. ధరలను అదుపుచేసే పనితనది కాదన్నట్లుగా పాలన సాగించారు. పదేళ్లుగా ధరలదాడితో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. ఇలా ధరలదాడిని అరికట్టకుండా..ఇడి డబ్బులను పంచిపెడతానని కొత్తగా మభ్య పెట్టడం దారుణం కాక మరోటి కాదు. ఇవన్నీ చేయకుండానే మూడోసారి గెలుపు తమదేనని కోరుకుంటున్నారు. . 400 సీట్లు గెలుస్తామని ప్రజలే తమలో విశ్వాసం నింపారనీ.. వాళ్ల దృక్పథం తనకు తెలుసునన్నారు. 2019 ఎన్నికల నుంచే తమ కూటమికి 400 స్థానాల మెజార్టీ ఉందని చెప్పారు. ఈసారి 400 మార్క్ దాటాలని తమ నేతలకు చెప్పాం అని మోడి వివరిస్తున్నారు. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన హోదాను సైతం మరిచి యాట్లాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా ఫోరం గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు. గతంలో బిజెపి అగ్రనేతలు వాజ్‌పేయ్, అద్వానీలు ఇలా దిగజారి ఎప్పుడూ మాట్లాడలేదు. ఓట్ల కోసం మోడీ పడుతున్న తాపత్రాయనికి ఇది పరాకాష్టగా చూడాలి.
’ఇండియా’ కూటమి విజయం సాధిస్తే అయోధ్య రాముడు మళ్లీ టెంట్‌లోకి మారతాడని ఆరోపించారు. ఇలాంటి ప్రచారాలు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించాలి. కరోనా అనంతరం ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నా మోడీ పట్టించుకోవడం లేదు. మోడీ చాయ్ అమ్మిండన్న వాదనే తప్ప ఆయనకు సామాన్యుల కష్టాలు పట్టడం లేదు. పెట్రో ధరలతో దాడి చేస్తూ మోడీ సుద్దులు పలుకుతున్నారు. పెట్రో ధరలతో అన్ని రకాల ధరలు పెరిగి సామాన్యులు బతకడం భారంగా మారింది. ప్రజలు నెత్తీనోరూ మొత్తు కుంటున్నా.. మోడీ తీరులో చలనం రావడం లేదు బిజెపి అధికారంలోకి వస్తే మార్పు వస్తుందనుకుంటే పెనం విూది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మోడీ, అమిత్ షాల ద్వయం పాలన సాగుతోంది. బిజెపిలో పెద్దరికం లేకుండా చేసి నిరంకుశ పాలనతో భారత్‌ను ఆర్థికంగా అధోగతి పాల్జేస్తున్న తీరు క్షంతవ్యం కాదు. ఇకపోతే ఏ పన్ను విధించినా అది నేరుగా ప్రజలపైనే పడుతుందని, దానివల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అని గుర్తించకుండా కేవలం జిఎస్టీ పరమౌషధం అన్న విధంగా ప్రచారం చేస్తూ వచ్చి ప్రజల నడ్డి విరిచారు. భారతదేశంలాంటి దేశంలో 18శాతం జిఎస్టీ అవసరమా అన్న ఆలోచన చేయడం లేదు. కేవలం 5శాతం సరిపోతుందని, అప్పుడు ఎక్కువ మంది జిఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశాలు పెరుగు తాయని, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా పట్టించుకోని మోడీ సర్కార్, జిఎస్టీ గురించి చంకలు గుద్దుకుంటే సరిపోదు. అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అంటున్న ప్రధాని మోడీ దివంగత ప్రధాని పివి నరసింహా రావు ఆర్థిక సంస్కరణలతో పోల్చుకోవాలి. ఆయన చేపట్టిన సంస్కరణలు ప్రజలకు ఎలా చేరగలిగాయో ఆలోచన చేయాలి. పివికి భారతరత్న ఇచ్చామని చెప్పుకోవడం కన్నా ఆయన ఆచరించిన ఆర్థిక విధానాలను అనుసరించాలి. ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వసూలు చేసి ఓటుబ్యాంకు కోసం పథకాలు ప్రకటించి వాటికి ఖర్చు చేయడం మంచిది కాదు. మోడీ తన చౌకబారు విమర్శలను మానాలి. హుందాగా మాట్లాడాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చర్చ చేయాలి. ధరల అదుపునకు తీసుకోబోయే చర్యల గురించి ఎన్నికల్లో మాట్లాడాలి. ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. అది జరగనంతకాలం మోడీ హ్యాట్రిక్ సాధించినా ..ప్రజలు మాత్రం జీవితంలో ఓడిపోతారని గుర్తించాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!