Vijay Deverakonda – SVC 59 : విజయ్ దేవరకొండ ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు. మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 59వ సినిమాగా రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రూరల్ యాక్షన్ డ్రామా కథతో సినిమా ఉండబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.
తాజాగా నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అంటూ రక్తంతో తడిచిన చేయి ఓ కత్తిని పట్టుకొని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ ఈసారి ఊర మాస్ గా కనిపించబోతున్నట్టు అర్ధమవుతుంది. ఈ ఒక్క పోస్టర్, డైలాగ్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ స్పై యాక్షన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అలాగే విజయ్ చేతిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఓ భారీ సినిమా ఉంది.