నేడు ప్రపంచ వ్యాపితంగానే ఫాసిస్టు శక్తులు విజృంభిస్తున్నాయి. పచ్చి మితవాద, నయా ఫాసిస్టు శక్తులు మన దేశంలో లాగానే టర్కీ, నెదర్లాండ్స్, మయన్మార్, ఇజ్రాయిల్, అర్జెంటీనా వంటి దేశాల్లో అధికారంలోకి వచ్చాయి.
అభివృద్ధి చెందిన ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికా వంటి దేశాలలో సైతం మితవాదులు బలపడుతున్నారు. ఉదారవాద ప్రజాస్వామ్యం ఈ క్రమంలో బలహీనపడుతున్నది. దాని స్థానంలో మితవాద, నయా ఫాసిస్టు శక్తులకు దారి కల్పించడం 21వ శతాబ్దంలో ఓ ముఖ్య పరిణామం. ఈ నేపథ్యంలో ఫాసిజంను ఎదుర్కోవడం, తుదముట్టించడం గురించి త్రీవమైన చర్చలు జరుగుతున్నాయి. అందుకు కృషి కూడా జరుగుతున్నది. అందువలన ఈ సందర్భంలో ‘మే 9 విక్టరీ డే’ గురించి ఒకసారి మననం చేసుకోవాలి.
విక్టరీ డే – ప్రపంచ జేజేలు
ప్రతి దేశంలోనూ విక్టరీ డేలు వుంటాయి. కాని మే 9 ప్రపంచ మనవాళి యావత్తు విజయోత్సవం జరుపుకోవాల్సిన రోజు. 1945 మే 9న ఆరేళ్లు సాగిన 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. రష్యన్ ఎర్రసైన్యం నాజీ ఫాసిస్టు హిట్లర్ (జర్మనీ) సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది. ప్రంపంచాన్నే గడగడలాడిస్తున్న జర్మనీ ఫాసిస్టు సైన్యం ఎర్రసైన్యం దాడి ముందు తలొంచి మే 9న లొంగిపోయింది. నరరూప రాక్షసుడు హిట్లర్ ఓటమి భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఫాసిస్టు హిట్లర్ ఆక్రమించుకున్న 10 దేశాలను, దాదాపు 12 కోట్ల మంది జనాభాను సోవియట్, సోషలిస్టు రష్యా తొలి కార్మిక వర్గ రాజ్యం విముక్తి చేసింది. మే 8వ తేదీన బ్రిటన్ అధినేత చర్చిల్ సోషలిస్టు రష్యా ప్రజలకు పంపిన సందేశంలో “నాజీ నియంతను మీ భూభాగం నుండి తరిమికొట్టడంలో సాధించిన విజయాలకు హృదయపూర్వకంగా మా అభినందనలు తెలుపుకొంటున్నాను.” అని పేర్కొన్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు డిగాల్ “మార్షల్ స్టాలిన్, ఐరోపా ఖండంలో యుద్ధం విజయవంతంగా ముగించినందుకు మీ దేశ ప్రజల ధైర్య, సాహసాలకు ప్రశంసలు, ప్రేమాభిమానాలు పంపుతున్నాను” అన్నాడు. సామ్రాజ్యవాద దేశాల నాయకులే కాదు. విముక్తి చెందిన దేశాల నాయకులు కూడా సోషలిస్టు రష్యాకి అశేష త్యాగాలు గావించిన సోవియట్ ప్రజలను వేనోళ్ల పొగిడారు. యుగోస్లేవియా నాయకుడు జోసఫ్ టిటో “మానవ జాతిని కాపాడి, దానికి మంచి భవిష్యత్‌ను ప్రసాదించిన ఎర్ర సైన్యానికి, రష్యా ప్రజలకు మా దేశ ప్రజల జేజేలు” అన్నాడు. ఆస్ట్రియా దేశాధినేత “రష్యాలోని సోషలిస్టు వ్యవస్థ, ఎర్రసైన్యం…మమ్మల్ని, ప్రపంచాన్ని కాపాడినందుకు మేము మా భవిష్యత్ తరాలు కూడా ఎంతో రుణపడి వుంటాము.” అని నాడు ప్రకటించాడు. ఇటలీ, ఈ యుద్ధంలో హిట్లర్ పక్షాన వుండింది. సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్స్ సాధించిన ఈ ఘన విజయం సందర్భంగా రష్యన్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాము” అని ప్రకటించాడు.
ఫాసిజం – సామ్రాజ్యవాదం – సోషలిజం
సామ్రాజ్యవాద దశను వివరిస్తూ లెనిన్ “ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యున్నత దశ, ఇది సోషలిస్టు విప్లవాల దశ” అని నిర్వచించారు. సోషలిజాన్ని, సోషలిస్టు వ్యవస్థను అంతం చేయాలన్నది ఫాసిస్టు లక్ష్యం. దాని పుట్టుక నుండి ఇది కనబడుతూనే వుంది. 1939-45 వరకు ఆరేళ్లు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో నాలుగేళ్లు (1941 జూన్ 22 నుండి) ఫాసిస్టు జర్మనీకి, సోషలిస్టు రష్యాకు మధ్యే యుద్ధం సాగింది. రెండు శిబిరాలుగా ఏర్పడి తమ లాభార్జనకు, భూమండలాన్ని పంచుకోవడానికి సాగిన మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) ముగిసిన 20 ఏళ్లలోనే సామ్రాజ్యవాదులు తన్నుకుని మరలా ప్రపంచాన్ని భయానకమైన యుద్ధంలోకి లాగారు. అమెరికా, ఇంగ్లండ్ ఫ్రాన్స్‌లు ఒక వైపు, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు మరోవైపు. నాటికి జరిగిన మరో ముఖ్యమైన రెండు పరిణామాలు మన దృష్టిలో వుండాలి. 1. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి (1917) తొలి కార్మిక రాజ్యం, సోషలిస్టు వ్యవస్థ రష్యాలో ఏర్పడి వున్నాయి. నిజానికి ఈ తొలి కార్మిక రాజ్యం అవతరించగానే తమ దేశం ప్రపంచం యుద్ధం నుండి వైదొలుగుతుందని ప్రకటించడంతోనే యుద్ధం ముగిసింది. ఇక రెండవది ఫాసిజం పుట్టుక, రష్యాలో సోషలిస్టు విప్లవం జయప్రదమై రష్యా అప్రతిహతంగా ముందుకు సాగుతుంటే పెట్టుబడిదారీ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోకి దొర్లిపోయింది. ప్రపంచ మానవాళి చూపు సోషలిజం వైపు మళ్లింది. అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఆవిర్భవించాయి. మార్క్సిస్టు సిద్ధాంతం ఔన్నత్యం విస్తరించనారంభించింది. ఈ పురోగమనాన్ని నిలువరించడానికి సామ్రాజ్యవాదం పుట్టించిన సిద్ధాంతమే ఫాసిజం. కమ్యూనిస్టు పార్టీలకు ప్రతిగా అనేక దేశాల్లో ఫాసిస్టు పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇటలీలో ముస్సోలినీ, జర్మనీలో హిట్లర్, జపాన్‌లో టోజో, స్పెయిన్‌లో ఫ్రాంకో, పోర్చుగల్ సల్జార్ల నాయకత్వాన ఫాసిజం విజృంభించింది. సరిగ్గా ఆ కాలంలోనే (1925) మన దేశంలో ఫాసిస్టు సంస్థ ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఫాసిజాన్ని, దాని ప్రమాదాన్ని నాటి ఉదారవాద ప్రజాస్వామ్యవాదులూ, సోషల్ డెమెక్రాట్లు అంటే అనేక బూర్జువా మధ్యేవాద పార్టీలు గుర్తించలేదు. కానీ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సరిగ్గా గుర్తించింది. “ఫాసిజం శ్రామిక జన బాహుళ్యంపై పెట్టుబడి చేసే అతి క్రూరమైన దాడి. అది అతి నీచమైన జాతి ఉన్మాదం. పచ్చి మితవాదానికి పరాకాష్ట. ఫాసిజం అనేది ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం. కార్మికవర్గం, విప్లవోన్ముఖóమైన రైతాంగం, మేధావులపై కక్ష తీర్చుకునే ఉగ్రవాద సంస్థ. విదేశస్తులపై విద్వేషం విరజిమ్మే సంస్థ” అని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్, సోవియట్ యూనియన్లు ప్రకటించాయి. ఈ పరిపక్వమైన అవగాహన వల్లనే ఫాసిజం ప్రమాదం నుండి ప్రపంచాన్ని రక్షించింది.
మరోవైపు ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తున్నా సామ్రాజ్యావాద దేశాలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ కూడా ఫాసిజం, సోషలిజాన్ని నాశనం చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చారు. ఇంగ్లండ్ ప్రధాని చర్చిల్ 1927లో ఓ సభలో మాట్లాడుతూ “నేను ఇటలీ దేశస్తుడనై వుంటే మీతోపాటు ఫాసిస్టుగా కచ్చితంగా వుండేవాడిని. లెనినిజం అనే మృగం ఆకలికి, కోరికలకి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటంలో చివరివరకు మీతో వుండేవాడిని” అని ఫాసిజాన్ని ప్రశంసించడం మన గమనంలో వుండాలి. అంతే కాదు, యుద్ధం ప్రారంభమై ఫాసిస్టు హిట్లర్ దేశదేశాల్ని ఆక్రమిస్తూ ముందుకొస్తున్నాడు, కలిసి రండని రష్యన్ కమ్యూనిస్టు ప్రభుత్వం పదే పదే కోరినా అమెరికా, ఇంగ్లండ్‌లు స్పందించకుండా వుండిపోయాయి. బీరాలు పలికిన ఫ్రాన్స్ హిట్లర్ పాదాక్రాంతం అయిపోయింది. ఇంగ్లండ్ ఇక తమ దేశం బలికానున్నదని వణికిపోతున్న తరుణంలో హిట్లర్ ఉన్నపళంగా యుద్ధాన్ని రష్యా పైకి మళ్లించాడు. అప్పటికీ మిత్రదేశాలు స్పందించకపోగా సోషలిస్టు రష్యా నాశనం చేయబడితే తమ వర్గ ప్రత్యర్ధి అంతం అయిపోతాడని కలలుకన్నారు. అమెరికా నాటి అధినేత (తర్వాత కాలంలో ఆ దేశ అధ్యక్షుడైన) హారీ ట్రూమన్ “యుద్ధంలో జర్మనీ గెలిచేటట్లు వుంటే రష్యాకు, రష్యా గెలిచేటట్లుంటే జర్మనీని బలపర్చుదాం. ముందు వాళ్లలో వాళ్లని కొట్టుకుని ఎంత మందిని చంపుకుంటారో చంపుకోనీ” అనడాన్ని బట్టి వారి అసలు ఉద్దేశం అర్ధమవుతుంది.
ఏమైనా రష్యానే గెలిచింది
సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, సోషలిస్టు రష్యా ఒంటి చేతి మీద ఫాసిస్టు జర్మనీని మట్టి కరిపించింది. రెండు కోట్ల మంది రష్యన్లు ఈ యుద్ధంలో సోషలిస్టు వ్యవస్థను కాపాడుకోవడానికి, ఫాసిజం నుండి ప్రపంచ మానవాళిని రక్షించడానికి ప్రాణతర్పణ చేశారు. అసామాన్యమైన యుద్ధ వ్యూహంతో, ప్రజాబలంతో, శక్తివంతమైన సోషలిస్టు సిద్ధాంత పటిమతో రష్యా, దాని అధినేత స్టాలిన్ నాయకత్వాన జర్మనీ సైన్యాన్ని, ఫాసిస్టు శక్తుల్ని మట్టి కరిపించగలిగారు. ఇక యుద్ధంలో రష్యా విజయం తధ్యమని తేలిపోవడంతో అమెరికా, ఇంగ్లండ్‌లు మల్లగుల్లాలు పడ్డాయి. 1945 ఏప్రిల్ 1న చర్చిల్ “రష్యా గెలిస్తే ప్రజల మనస్సులో రష్యా స్థానం బలంగా పెరుగుతుంది. ఇది మనకు నష్టం కదా! అందువలన ఇక మనం రంగంలోకి దిగాలి. ఇక లోపాయికారిగా జర్మనీ సైన్యం రష్యాను చుట్టుముట్టడాన్ని చూసీచూడకుండా వదిలేయకూడదు.” అని సందేశం పంపాడు.
ఈ చరిత్ర ఏం చెబుతోంది!!
ఫాసిజం ఏ రూపంలో వున్నా, ఏ దేశంలోనైనా దాన్ని అంతిమంగా ఓడించగలిగేది సోషలిస్టు శక్తులే. ఫాసిజం అనేది అనుకోని ఓ చారిత్రక ఘటన కాదు. పెట్టుబడి వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే సందర్భంలో ఆ వర్గ పాలనే సంక్షోభంలోకి దిగిపోయేటప్పుడు వచ్చే రాజకీయ విధానం. ఈ క్రమంలో ఉదారవాద ప్రజాస్వామ్యం క్రమంగా బలహీనపడుతూ ఓ గుణాత్మకమైన పరిణామంగా ఫాసిజం తెరపైకి వస్తుంది అంటారు ఫాస్టర్. వలస కార్మికుల పైన (కాందిశీకుల పైన), మహిళలు, పర్యావరణవాదులు, ట్రాన్స్జండర్ల పైన, వారి హక్కుల పైన కార్మిక/ కర్షక ఉద్యమాలపైన విషం కక్కుతూ, భౌతిక దాడులు చేస్తూ ప్రారంభమైన ఫాసిజం జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అందలం ఎక్కుతుంది. ప్రముఖ కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు రజనీ పామీదత్ తన గ్రంథం “ఫాసిజం-సాంఘిక విప్లవం”లో “బూర్జువా ప్రజాస్వామ్యంపై ఆధారపడి ఫాసిజాన్ని ఓడించలేము. కార్మిక వర్గం పీడిత వర్గాలను కలుపుకుని చేసే పోరాటాల ద్వారానే ఫాసిజాన్ని తుదముట్టించగలం” అన్న మాటలు గుర్తుంచుకుందాం.