ఏపీలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. శుక్రవారం (మే 3)నాడు కూడా ఏపీలోని 28 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 156 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శనివారంనాడు (మే 4) ఏపీలోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 261 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శుక్రవారంనాడు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (156):
శ్రీకాకుళం 10, విజయనగరం 12, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 10, అనకాపల్లి 11, కాకినాడ 7, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, కృష్ణా 2, ఎన్టీఆర్ 11, గుంటూరు 9, పల్నాడు 26, బాపట్ల 3, ప్రకాశం 23, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 13, నంద్యాల 1, అనంతపురం 1, అన్నమయ్య 2, తిరుపతి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
గురువారం ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1°C, మార్కాపురంలో 47°C, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7°C, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 46.6°C, చిత్తూరు జిల్లా తవణంపల్లె, వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో 46.4°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కర్నూలు జిల్లా గూడూరు, పల్నాడు జిల్లా విజయపురిలో 45.3°C, తిరుపతి జిల్లా చియ్యవరంలో 44.8°C, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 44.6°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 14 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 188 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు.
వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్,కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.