రోజురోజుకూ సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత, ఎండవేడిని జనాలు తాళలేకపోతున్నారు. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీలు, విజయనగరం జిల్లా జామిలో 44.9 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 44.2 డిగ్రీలు..
రోజురోజుకూ సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత, ఎండవేడిని జనాలు తాళలేకపోతున్నారు. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీలు, విజయనగరం జిల్లా జామిలో 44.9 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 44.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.8 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోట, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 43.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 66 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. బుధవారం 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 143 మండలాల్లోవడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ఎల్లుండి 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 109 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(46):-
శ్రీకాకుళం 13 , విజయనగరం 19 , పార్వతీపురంమన్యం 11 , అనకాపల్లి 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(143):-
శ్రీకాకుళం16 , విజయనగరం 6, పార్వతీపురంమన్యం 4, అల్లూరిసీతారామరాజు 9, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 18, కోనసీమ 9, తూర్పుగోదావరి 19, పశ్చిమగోదావరి 4, ఏలూరు 12, కృష్ణా 6, ఎన్టీఆర్ 5, గుంటూరు 13, పల్నాడు 2, బాపట్ల 1, తిరుపతి జిల్లా గూడూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
చల్లటి వానలు.. అక్కడక్కడా..
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశముంది.