సమతాకుంభ్ 2024 బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ రథోత్సవం, చక్రస్నానం కన్నుల పండువగా సాగింది. రథారూఢుడైన భగవంతుడికి విరజా పుష్కరిణిలో చేయించిన చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. మరో విశేషోత్సవం రథోత్సవం. ఆ భగవంతుడిని దర్శించుకున్న భక్తులు కర్మబంధముల నుంచి విముక్తులై పవిత్రులయ్యారు.
సమతాకుంభ్ 2024 బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం, చక్రస్నానం కన్నుల పండువగా సాగింది. రథారూఢుడైన భగవంతుడికి విరజా పుష్కరిణిలో చేయించిన చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. మరో విశేషోత్సవం రథోత్సవం. ఆ భగవంతుడిని దర్శించుకున్న భక్తులు కర్మబంధముల నుంచి విముక్తులై పవిత్రులయ్యారు. గురువారం ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో అర్చకస్వాములు, ఋత్వికులు, వేద విద్యార్థులు కలిసి ధాన్యం చేశారు. స్వామివారు అష్టాక్షరీ లఘుజప విధానాన్ని అనుగ్రహించారు. ధాన్యం తర్వాత ఆరాధన, సేవాకాలం, శాత్తుముఱై పూర్తి చేసుకుని, వేద విన్నపాలతో యాగ కార్యక్రమం జరిపించారు. త్రిదండి చినజీయర్ స్వామివారు భక్తులందరికీ స్వయంగా తీర్థాన్ని అనుగ్రహించారు.నిత్యపూర్ణాహుతి కార్యక్రమం తర్వాత బలిహరణ, వేదవిన్నపాలు చేశారు. వేదవిన్నపాలు పూర్తికాగానే వేదికపై త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో 18 దివ్యదేశాధీశులకు తిరుమంజన సేవ జరిపించారు.
ఈ రోజు రథోత్సవం విశిష్ఠత
ఈ రథంలో విశేషం ఉంది. శ్రీరంగంలో ఉండే ప్రణవాకార విమానంలా మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఉన్న రథానికి కూడా ప్రణవాకార విమాన గోపురం ఉండడమే ఆ విశేషం. చుట్టూరా దేవతామూర్తులు, ఆళ్వార్లు, ఆచార్యులు, చతుర్ముఖ బ్రహ్మ, అనేక రకముల శిల్పకళా సౌందర్యానికి కాణాచిలా ఉండటం ఈ రథం ప్రత్యేకత. భగవంతుడు రథమునే తన వాహనంగా చేసుకుని రథంలోకి వేంచేస్తాడు. రథంలో వేంచేసిన ఆ భగవంతుడిని దర్శిస్తే మనం పవిత్రులమవుతాం. ఆ తత్త్వాన్ని భావిస్తూ రథారూఢుడైన భగవంతుడిని దర్శిస్తే కర్మబంధముల నుండి విముక్తులవుతామని శాస్త్రములు చెబుతున్నాయి. ముందుగా రథములో శ్రీరామచంద్ర ప్రభువు వేంచేశారు. తర్వాత 108 దివ్యదేశ శ్రీమూర్తులలో నుండి మొదటి దివ్య దేశపెరుమాళ్ళు శ్రీరంగనాథుడు, అంతిమ దివ్యదేశ పెరుమాళ్ళు శ్రీ వైకుంఠనాథుడు వేంచేశారు. శాస్త్ర నియమానుసారంగా మొదటి, చివరి వారిని ఏకత్ర చేరిస్తే, మధ్యలోని అందరూ పెరుమాళ్ళు కూడా చేరుతారట. వ్యాకరణ శాస్త్రానుసారం “ఆదిరంతేన సహేతా” ఆది అంతములను కలుపుట. శ్రీసుదర్శన భగవానుడు కూడా రథంలోకి వేంచేశారు. గరుడ భగవానుడు, బ్రహ్మతో పాటు విశ్వకర్మ ముందు ఉండడం విశేషం. భగవంతుడు రథంలోకి ప్రవేశించగానే దేవతలకి సాత్విక బలిహరణ జరిగింది. తర్వాత గోవింద నామాలతో, సంకీర్తనలతో, భాజా భజంత్రీలతో, కోలాట నృత్యములతో భక్తులు వెంటరాగా త్రిదండి చినజీయర్ స్వామివారు రథయాత్రను ప్రారంభించారు. రథము యాగశాలకు చేరుకున్నాకపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. తర్వాత సమతా ప్రాంగణం ప్రవేశవాటికకు ప్రక్కనున్న ద్వారం గుండా విరజా పుష్కరిణికి రథయాత్ర చేరింది.
ఈ రోజు చక్రస్నానం విశిష్ఠత
రథారూఢుడైన భగవంతుడు చక్రస్నానం కోసం విరజాపుష్కరిణికి చేరుకున్నారు. శ్రీరంగనాథుడు, శ్రీవైకుంఠనాథుడు, శ్రీరామచంద్రప్రభువు, సుదర్శన భగవానుని పుష్కరణిలో స్నానమాడి, ఆ జలాలను పవిత్రం చేయమని ఆజ్ఞాపించగా, సుదర్శన భగవానుని మన అర్చక స్వాములు పవిత్ర మంత్రోచ్చారణలతో పుష్కరణిలో స్నానం ఆడించారు. భగవంతుడికి ఆ జలాలతో అభిషేకం జరిగింది. తర్వాత త్రిదండ్రి చినజీయర్ స్వామివారు, శ్రీమాన్ రామేశ్వరరావు, భక్తులంతా అవభృథ స్నానం ఆచరించారు. ఈ పవిత్ర కార్యక్రమం తర్వాత పెరుమాళ్లు తమ తమ స్థానాలకు వేంచేశారు. అలాంటి వైకుంఠ పుష్కరిణి అష్టగుణఆవిష్కరణ కలిగిన పుష్కరణిలో స్నానమాడితే మళ్లీ జన్మ ఉండదంటారు. అలాంటి అదృష్టాన్నది మనకందరికీ కలిగించిన మహనీయులు త్రిదండి చినజీయర్ స్వామి.
సాయంత్రం శ్రీమధ్వైష్ణవం 108 దివ్యదేశాల వైభవం-శ్రీమతి శంకరాభరణం మంజుభార్గవి, హీరోయిన్ శ్రీలీల నృత్య ప్రదర్శన కన్నులపండువగా సాగింది.