సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) చాలా తెలివి మీరారు. ఎలాంటి వారినైనా సులభంగా బురిడీ కొట్టిస్తూ డబ్బులు దోచేస్తున్నారు. వలపు వలతో ప్రేమలోకి దించి వారిని చివరికి నిండా ముంచేస్తున్నారు.
ఈ రొమాంటిక్ స్కామ్స్‌లో “పిగ్ బుచరింగ్” బాధితులను మానసికంగా, ఆర్థికంగా కుదేలు చేస్తుంది. ఇటీవల శ్రేయ దత్తా అనే భారతీయ మహిళ ఈ ఆన్లైన్ రొమాన్స్ స్కామ్ బారినపడి రూ.3.73 కోట్లు మోసపోయింది.
డేటింగ్ యాప్‌లో బాధితురాలికి పరిచయమైన వ్యక్తి, “పిగ్ బుచరింగ్” స్కామ్ వలలో పడేశాడు. ప్రియుడిగా నటించి డబ్బు కాజేశాడు. ఫిలడెల్ఫియాలో నివసిస్తున్న టెక్ ప్రొఫెషనల్ శ్రేయ, ఒక డేటింగ్ యాప్‌లో “అన్సెల్” అనే ఫ్రెంచ్ వైన్ వ్యాపారిగా చెప్పుకునే వ్యక్తిని కలిసింది. చాలా నెలలుగా అన్సెల్ శ్రేయకు ప్రేమగా మెసేజ్‌లు పంపించాడు. భవిష్యత్తు గురించి మాయమాటలు చెప్పి నమ్మించాడు. అతనితో ప్రేమ, ఆర్థిక భద్రత లభిస్తుందని ఆమె కూడా నమ్మింది.
పిగ్ బుచరింగ్ ఆనేది ఫైనాన్షియల్ స్కామ్. ఒక వ్యక్తికి స్నేహితునిగా లేదా రొమాంటిక్ ఇంట్రస్ట్ ఉన్న వ్యక్తిగా దగ్గరై వారితో పెట్టుబడులు, జాబ్ ఆఫర్స్, ఇతర స్కీమ్స్‌కు నిధులు మళ్లించడం వంటివి ఈ స్కామ్స్‌లో జరుగుతాయి.
* పెద్ద స్కామర్
తనతో మాట్లాడుతున్నది నిజాయితీగల వ్యక్తి అని ఆమె భ్రమపడింది కానీ అన్సెల్ ఒక స్కామర్. ఇతను నమ్మదగిన పర్సనాలిటీని క్రియేట్ చేసేందుకు డీప్‌ఫేక్ వీడియోలు, అడ్వాన్స్డ్ డిజిటల్ టూల్స్ ఉపయోగించాడు. స్కామర్ వ్యూహాలు నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో, శ్రేయ అతడు చెప్పినవన్నీ నమ్మింది. ఎమోషనల్ మానిప్యులేషన్ వల్ల, ఆమె పూర్తిగా స్కామర్ చెప్పినట్లే వినేసింది. దీంతో అన్సెల్ చెప్పినట్లు ఆమె అక్షరాలా 4,50,000 డాలర్లు (సుమారు రూ.3.73 కోట్లు) మోసపూరిత యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఇందులో ఆమె సేవింగ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి.
* డేటింగ్ యాప్‌లో పరిచయం
ఇటీవలే విడాకులు తీసుకున్న శ్రేయకు, డేటింగ్ యాప్ హింజ్ (Hinge)లో స్కామర్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వాట్సాప్‌లో చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ అన్సెల్ శ్రేయతో రిలేషన్ కొనసాగించాడు. వాలెంటైన్స్ డే నాడు ఒక బొకే కూడా పంపించి గాఢంగా ప్రేమిస్తున్నట్లు నటించాడు. స్కామర్ అంతిమ లక్ష్యం దత్తాను ఫేక్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిలోకి ఆకర్షించడం.
ఈ క్రమంలో అన్సెల్ ఓ క్రిప్టో ట్రేడింగ్ యాప్‌కి లింక్‌ను శ్రేయకి పంపించాడు. లాభాల ఆశ చూపించాడు. శ్రేయకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ కలిగింది. దాంతో పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడి రెండింతలు ఆదాయం కనిపించడంతో, దానిని విత్‌డ్రా చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ యాప్ ముందుగా ట్యాక్స్ పే చేయాలని ఫ్రాడ్ మెసేజ్ పంపించింది.
అన్సెల్ తన ఫోటోలే అని చెప్పుకుంటూ పంపించిన చిత్రాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా శ్రేయ సోదరుడు అసలైన విషయం తెలుసుకున్నాడు. ఆ ఫోటోలు ఒక జర్మన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్వి అని తెలిసింది. శ్రేయ మోసపోయానని గ్రహించింది. ప్రేమికుడు మోసగాడని డబ్బులన్నీ తీసుకున్నాడని తెలిసి ఆమె గుండె పగిలింది. డిప్రెషన్, PTSD-వంటి మానసిక సమస్యలను ఫేస్ చేసింది. ఏ పని చేయలేకపోయింది, నిద్ర పట్టక చాలా రోజులు బాధపడింది.
ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు వాట్సాప్, సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో తెలియని పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. స్కామర్లు ఎమోషనల్ మానిప్యులేషన్‌తో వారికి కావలసిన పనులను ఈజీగా చేయించుకోగలుగుతారు కాబట్టి తెలియని వారితో మాట్లాడకపోవడమే మంచిది.