వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఓట్ల లొల్లి షురూ అయ్యింది. బోగస్ ఓట్లపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. బోగస్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిశారు వైసీపీ నేతలు. హైదరాబాద్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై ఫిర్యాదు చేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఓట్ల లొల్లి షురూ అయ్యింది. బోగస్ ఓట్లపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. బోగస్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిశారు వైసీపీ నేతలు. హైదరాబాద్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని సీఈవోను కలిసి కంప్లైంట్ చేశారు మంత్రి మెరుగ నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని విమర్శించారు మంత్రి మేరుగ. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఓట్ల జాబితాపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతుంది..ఒకరిపై మరొక పార్టీ నేతలు ఆరోపణలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తున్నారు. సుమారు ఆరు నెలలుగా తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నేతలు ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై ఫిర్యాదులు చేస్తున్నారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీతో పాటు వైసీపీ కూడా ఆరోపణలు చేస్తొంది. ఓట్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వే పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. ఆ తర్వాత అక్టోబర్ 27న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేసింది. అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఫారం – 7 ను దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని, ఒకే ఇంటి నెంబర్‌తో ఎక్కువగా నకిలీ ఓట్లను చేరుతున్నారని సీఈవోకు ఫిర్యాదు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇదే సమయంలో వైసీపీ కూడా ఆధారాలతో సహా నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేస్తొంది. రెండు పార్టీల ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు అభ్యంతరాల స్వీకరణకు గడువు ముంచుకొస్తుండటం, సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించినప్పటికీ ఫిర్యాదులు వస్తుండటంతో ఈసీ కూడా మరింత ఫోకస్ పెట్టింది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల తంతుపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో ఓట్ల పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరనుంది.
సీఈసీని కలవనున్న చంద్రబాబు
రాష్ట్రంలో ఓట్ల పంచాయతీ రోజురోజుకూ ముదురుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల నుంచి కలెక్టర్ల వరకూ అందరిపైనా ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీఎల్ఓలను అడ్డం పెట్టుకుని ఫారం -7, ఫారం -6 ల ద్వారా ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇక 8 జిల్లాల కలెక్టర్లు కూడా వైసీపీకి సహకరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. అయితే ఈసీ స్పందన సరిగా లేదని, కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనికోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రఎన్నికల కమిషన్ ను కలవనున్నారు. చంద్రబాబు గతంలో కూడా ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సీఈసీ విచారణతో ఓట్ల జాబితాలో అక్రమాలపై చర్యలు చేపట్టింది. తాజాగా మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ద్వారా ఓట్ల జాబితాలో అక్రమాలకు చెక్ పడుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు సీఈసీ ని కలవడాన్ని వైసీపీ తప్పు పడుతుంది. టీడీపీ హయాంలో ఓట్ల జాబితాలో భారీగా అక్రమాలకు పాల్పడి ఇప్పుడు వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
డిసెంబర్ 10న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు
రాష్టంలో ఓటర్ జాబితాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకులను నియమించింది. పలు జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 9వ తేదీ వరకూ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలకు గడువు ముగియనుంది. ఆ తర్వాత డిసెంబర్ 26 వరకూ అభ్యంతరాలపై మార్పులు చేర్పులు చేయనున్నారు. అనంతరం జనవరి 5 వ తేదీన ఫైనల్ ఓటర్ జాబితా ప్రకటించనున్నారు.ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రానికి రానున్నారు.డిసెంబర్ 10వ తేదీన సీఈసీ అధికారులు రాష్ట్రానికి వచ్చి ఓటర్ జాబితా ఫిర్యాదులు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఈలోగానే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయదం ద్వారా ఈసీ పై ఒత్తిడి తీసుకురావచ్చనేది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది.