హైదరాబాద్:ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో 30 మందికి పైగా భారాస, భాజపాల నుంచి బయటకు వచ్చినవారే. భారాస అభ్యర్థులను ప్రకటించే సమయానికి మూడోవంతు స్థానాలకు బలమైన అభ్యర్థులు లేక ఆందోళనలో ఉన్న కాంగ్రెస్‌లోకి పలువురు వచ్చి చేరి టికెట్లు దక్కించుకొన్నారు.
వీరిలో 20 మంది విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి గాను ఆరు చోట్ల గెలిచింది. ఇందులో ఇద్దరు మినహా మిగిలిన నలుగురు భారాసలో చేరారు. అయితే ఈ జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు నాయకులు భారాస నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి(పాలేరు), కోరం కనకయ్య(ఇల్లెందు), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), ఆదినారాయణ(అశ్వరావుపేట) ఉన్నారు. సత్తుపల్లి నుంచి గెలుపొందిన మట్టా రాగమయి, ఖమ్మం నుంచి గెలిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కూడా భారాస నుంచి వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన వారే.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్), మేఘారెడ్డి(వనపర్తి), కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి(నాగర్‌కర్నూల్) భారాస నుంచి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(మహబూబ్‌నగర్) భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేశారు. వీరంతా విజయం సాధించారు. అలాగే ఆఖరి నిమిషంలో టికెట్ ఖరారైన వారు కూడా గెలుపొందడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. మనోహర్‌రెడ్డి(తాండూరు), వేముల వీరేశం(నకిరేకల్), మందల శామేల్(తుంగతుర్తి)లు గెలుపొందారు. మైనంపల్లి హన్మంతరావు(మల్కాజిగిరి) ఓడిపోగా, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్(మెదక్) గెలుపొందారు. భాజపా నుంచి ఆఖరి నిమిషంలో చేరిన గడ్డం వివేక్(చెన్నూరు), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు), రేవూరి ప్రకాశ్‌రెడ్డి(పరకాల) విజయం సాధించారు. భాజపా నుంచి చేరిన వారిలో ఎ.చంద్రశేఖర్(జహీరాబాద్), వినయ్‌కుమార్‌రెడ్డి(ఆర్మూరు), ఏనుగు రవీందర్‌రెడ్డి(బాన్సువాడ), భారాస నుంచి చేరిన వారిలో శ్యాంనాయక్(ఆసిఫాబాద్), బండి రమేశ్(కూకట్పల్లి), జగదీశ్వరగౌడ్(శేరిలింగంపల్లి), శ్రీహరిరావు(నిర్మల్), విడతల ప్రణవ్(హుజూరాబాద్), రావి శ్రీనివాస్(సిర్పూరు), పురుమల్ల శ్రీనివాస్(కరీంనగర్) ఓడిపోయారు. పోలీసు అధికారిగా పనిచేసి వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాగరాజు, పారిశ్రామిక రంగంలో ఉన్న తోట లక్ష్మీకాంతరావు(జుక్కల్) గెలుపొందారు. సునీల్‌కుమార్(బాల్కొండ) మాత్రం ఓడిపోయారు.