మచిలీపట్నం నవంబర్ 27 ఆంధ్రపత్రిక. :
స్పందన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, డిఆర్ఓ పెద్ది రోజా, ముడా విసి రాజ్యలక్ష్మి లతో కలిసి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సంబంధిత ఆర్డీవోలు తాసిల్దార్లతో మాట్లాడి ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలిలా వున్నాయి:
చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం వీధికి చెందిన బేతాళ కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను ఎర్ర శ్రీనివాసకుమార్ తో కలిసి 10-7-2007 తేదీన మచిలీపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కరగ్రహారం గ్రామానికి చెందిన ఆర్ఎస్ నంబర్ 118/4లో 46 సెంట్లు భూమిని యార్లగడ్డ శివపార్వతి వద్ద నుండి క్రయం ద్వారా పొందామని, రిజిస్టర్ కాలంలో సర్వే చేయించి హద్దులు వేసుకున్నామని, ప్రస్తుతం సరిహద్దు దారుడైన కంచర్ల రవి సరిహద్దురాళ్లు తీసివేసి రాత్రిపూట ట్రాక్టర్లతో మట్టి దొంగలించి తన పొలమును ఆక్రమించుకున్నారని, తన వయసు 75 సంవత్సరాలని తిరగలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తనకు న్యాయం చేసి పొలం సర్వే చేయించి ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
మొవ్వ మండలం మల్లికార్జునపురం బాట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన అయినంపూడి గోవర్ధన శాస్త్రి అనే 85 సంవత్సరాల వృద్ధులు స్పందన హాలుకు రాగా జిల్లా కలెక్టర్ వెంటనే ఒక కుర్చీని తెప్పించి అందులో కూర్చోమని చెప్పి అతని నుండి అర్జీ స్వీకరించి సమస్యను ఎంతో ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన శాస్త్రి కలెక్టర్ కు విన్నవిస్తూ తనకు 70 సెంట్లు మాగాణి భూమి తొట్లవల్లూరు గ్రామం నార్త్ వల్లూరులో రీ సర్వే నంబర్ 150, 153లలో ఉందని అది కొందరికి కౌలుకి ఇచ్చానని వారు కౌలు సొమ్ము ఇవ్వనందున తనకు జీవనోపాధి కష్టంగా ఉందని ఈ విషయమే కోర్టు కూడా వెళ్లానని, ఉయ్యూరు జూనియర్స్ సివిల్ జడ్జి కోర్టు తనకు కౌలు ఇప్పించాలని ఇంజక్షన్ ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. తనకు ఐదు సంవత్సరాల పంట డబ్బులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి ఉయ్యూరు ఆర్డిఓ డి.రాజు, సంబంధిత తహసిల్దారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అర్జీదారుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని ఆదేశించారు.మళ్లీ కలెక్టరేట్ కు రావద్దని, అతని సమస్య స్థానికంగానే పరిష్కారం అవుతుందని కలెక్టర్ ఆ వృద్ధునికి ధైర్యం చెప్పి పంపించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీలను సానుకూలంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు.
అనంతరం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు స్థానిక స్టార్ కళాశాల సౌజన్యంతో స్టడీ మెటీరియల్ జిల్లా కలెక్టర్ అందజేసి బాగా చదువుకుని జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి పి ఎస్ ఆర్ ప్రసాద్, జడ్పీ సీఈవో వి. జ్యోతి బసు, డిపిఓ నాగేశ్వర్ నాయక్ డీఈవో తాహెరా సుల్తానా, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతా బాయి పౌరసరఫరాల సంస్థ డి ఎం శ్రీధర్, పంచాయతీరాజ్ ఎస్ఈ విజయ్ కుమారి, ఐసిడిఎస్ పిడి సువర్ణ, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్యతదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.