మల్కాజ్గిరి రాజకీయం మైనంపల్లి ఎగ్జిట్ తరువాత మల్కాజ్‌గిరిపై మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ కన్నేసిందా? ఎంపీగా పోటీ చేసి ఓడిన మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలో దింపేందుకు బీఆర్ఎస్ డిసైడైందా? అల్లుడుకి సీటిస్తే గెలిపించుకుంటానన్న ధీమాతో మంత్రి ఉన్నారా? ఓ ఎమ్మెల్సీతో పాటు మహిళానేత కూడా ఆ సీటుకోసం ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెస్ నేత పార్టీవీడితే అక్కడ లెక్క మారిపోతుందా?
మల్కాజ్గిరి చుట్టే తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. గ్రేటర్సిటీపరిధిలోని ఈ నియోజకవర్గం అధికారపార్టీకి ఇప్పుడు ప్రిస్టేజియస్‌గా మారింది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టికెట్ ప్రకటించాక తిరుగుబాటు చేయటంతో మల్కాజ్‌గిరిపై గట్టిగా గురిపెట్టింది బీఆర్ఎస్. తన కొడుక్కి మెదక్ సీటు ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన మైనంపల్లి గులాబీపార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టికెట్ ప్రకటించాక మైనంపల్లి పార్టీ వీడటంతో మల్కాజ్‌గిరిలో గట్టి అభ్యర్థిని దించాలనుకుంటోంది బీఆర్ఎస్. మైనంపల్లి స్పీడ్‌కి బ్రేకేసేందుకు ఆయనకి గట్టి పోటీనిచ్చే నాయకుడికోసం కసరత్తు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని దాదాపుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నా మరికొన్ని పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి.
మైనంపల్లి నిష్క్రమణతో ఖాళీ అయిన మల్కాజ్‌గిరిపై గురిపెట్టారట మంత్రి మల్లారెడ్డి. అనుకోకుండా పక్క సీటు ఖాళీ కావటంతో తన కుటుంబానికి ఇస్తే గెలిపించుకుని వస్తానని పార్టీ పెద్దలకు మంత్రి మల్లారెడ్డి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరారట మంత్రి మల్లారెడ్డి. అధిష్ఠానం ఆలోచన ఎలా ఉందోకానీ మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కూడా అవకాశమిస్తే మల్కాజ్‌గిరినుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారట. అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్న శంభీపూర్‌రాజు ఛాన్స్ ప్లీజ్ అని అడుగుతున్నట్లు సమాచారం. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఎందుకని పార్టీ భావిస్తే.. తమకు అవకాశం వస్తుందని కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
చింతల కుటుంబం కూడా మల్కాజ్గిరి సీటుపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలిపేరు వినిపిస్తోంది. ఆల్వాల్ కార్పొరేటర్‌గా ఉన్న చింతల విజయశాంతిరెడ్డికి మహిళాకోటాలో అవకాశం ఇవ్వాలని కోరుతోందట ఆ కుటుంబం. ముదిరాజ్ వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్‌తో పాటు మరికొందరు లైన్లో ఉన్నా మైనంపల్లిలాంటి నాయకుడిని ఢీకొట్టాలంటే మంత్రి అల్లుడితోనే సాధ్యమంటున్నారట కొందరు. అధినాయకత్వంనుంచి సానుకూల సంకేతాలు రావడం వల్లే ర్యాలీలు, సమావేశాలతో మర్రి రాజశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగిపోయారని భావిస్తున్నారు. మైనంపల్లి వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు బలప్రదర్శనకు దిగారు మల్లారెడ్డి అల్లుడు.
కాంగ్రెస్‌లో చేరుతున్న మైనంపల్లికే మల్కాజ్గిరి టికెట్ దక్కబోతోంది. ఆయన సిట్టింగ్ సీటు కావటంతో ఆ విషయంలో మరో మాటలేనట్లే. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఇక్కడినుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. మైనంపల్లి ఎపిసోడ్‌తో ఆయన అవకాశాలకు గండిపడింది. బీఆర్ఎస్ నందికంటికోసం ప్రయత్నిస్తోందన్న ప్రచారంతో ముందే అలర్ట్ అయ్యారు టీకాంగ్రెస్ నేతలు. సీఎల్పీ నేత భట్టి, పీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్, మల్లురవి శ్రీధర్నివాసానికి వెళ్లి చర్చించారు. టికెట్వచ్చినా రాకపోయినా పార్టీకోసం పనిచేయాలని నందికంటికి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ప్రాధాన్యం ఉంటుందని టీకాంగ్రెస్నేతలు ఆయనకు హామీఇచ్చారు. అయితే మైనంపల్లికి టికెట్ ప్రకటించాక ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేమని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
మొత్తానికి మైనంపల్లి ఎపిసోడ్ ప్రధానపార్టీల ఈక్వేషన్స్‌ని మార్చేస్తోంది. మైనంపల్లిని ఎలాగైనా ఆపాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. అదే సమయంలో ఆయన ఎంట్రీతో మల్కాజ్గిరి కాంగ్రెస్‌లో అసమ్మతి చెలరేగేలా ఉంది. బీజేపీనుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజ్గిరి బరిలో ఉండబోతున్నారు. మరి బీఆర్ఎస్ చివరికి ఎవరిని దించుతుందో.. మైనంపల్లికి టికెట్ ఇస్తే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న డీసీసీ అధ్యక్షుడి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న అంచనాలతో అందరి చూపూ ఇప్పుడు మల్కాజ్గిరి వైపే.