తెలంగాణలో ఎన్నికల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. అన్ని పార్టీలు ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ జాబితా ఈనెల 24న ప్రకటించనుంది. అయితే బీజేపీలో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి కసరత్తు జరగలేదు. కేవలం దరఖాస్తుల ప్రక్రియ వరకే పరిమితమయ్యారు. 6 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుంచి అభ్యర్థులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. అన్ని పార్టీలు ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ జాబితా ఈనెల 24న ప్రకటించనుంది. అయితే బీజేపీలో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి కసరత్తు జరగలేదు. కేవలం దరఖాస్తుల ప్రక్రియ వరకే పరిమితమయ్యారు. 6 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుంచి అభ్యర్థులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. వీటిపైనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఈటల రాజేందర్, విజయశాంతి వ్యవహారం తోడైంది. దీంతో బీజేపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది.
ఫైర్ బ్రాండ్ విజయశాంతి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రాధాన్యత దక్కడంలేదని అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా ట్వీట్లతో హాట్ టాపిక్ గా మారారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చి తనకు ఇవ్వకపోవడంతో ఆమె అలిగి వెళ్లిపోయారు. తెలంగాణను వ్యతిరేకించే వారితో వేదికను పంచుకోవడం ఇష్టంలేదని బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెళ్లగక్కారు. అలాగే బండి సంజయ్ మార్పుపైనా హర్ట్ అయ్యారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇందుకు కారణం ఈటలే అని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా తాను పార్టీ మారుతున్నారని సొంత పార్టీ నేతలే ప్రచారంచేస్తున్నారని ఫైర్ అయిన రాములమ్మ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా చిట్ చాట్ పేరుతో పార్టీ అంతర్గత విషయాలను లీకులివ్వలబోనంటూ చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అన్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే ఈటల రాజేందర్ సైతం తనపై పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియా సమావేశంలో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. టిఫిన్ మీటింగ్, లంచ్ మీట్లకు భయపడేది లేదని రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఎవరికి వారుగా ఎదగాలి తప్పితే పక్కవారిని తొక్కి పైకొచ్చే పద్ధతిని మార్చుకోవాలని ఈటల స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించారన్నదే చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి ఈ ఇద్దరి నాయకుల గురించే బీజేపీలో చర్చ జరగుతోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి అంతర్యుద్ధాలు పార్టీని ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్తుందో చూడాల్సిందే.