కుట్టుమెషిన్లు, గోడ గడియారాలు, కుక్కర్లు తెప్పించి జిల్లాలోని సమీప గోదాంలో నిల్వ చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలవడం.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కృతనిశ్చయంతోనే ఇలా తాయిలాల జాతరకు తెరలేపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజక వర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుండే నేతలు రెడీ అవుతున్నారు. అధికార పార్టీ సీట్ల ప్రకటన తర్వాత జోష్ మరింత పెరగడంతో ప్రతిపక్ష నేతలు వేగం పెంచారు. టికెట్ పక్కగా మాకే అనుకుంటూ ధీమాతో కొందరు.. ఒక వేళ టికెట్ రాకుంటే పక్క పార్టీలోకి జంప్ అయి పోటీ చేయాలని కొందరు.. ఏదైతే అదైతది ఒంటరిగానే బరిలోకి దిగాల్సిందే అని స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఇంకొందరు ఇప్పటి నుంచి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
టార్గెట్ 100 నినాదంతో ముచ్చటగా మూడు నెలల్లో నియోజక వర్గం మొత్తం చుట్టేసి ఓటర్లనాడి పట్టేసి.. తాయిలాలతో ఓటర్లను సంతోషంలో ముంచెత్తి అప్పన్నంగా ఓట్ల వరద పారించుకోవాలని ఫిక్స్ అవుతున్నారు. అలాంటి సీన్ ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొన్ని నియోజక వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కొందరు నేతలు భారీ ఆశలు పెట్టుకుంటుంటే.. తొలిసారే భారీ విజయాన్ని అందుకోవాలని కొత్త నేతలు మరింత తహతహాలాడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆదిలాబాద్, నిర్మల్ , ఆసిపాబాద్ నియోజకవర్గాల్లో అప్పుడే ప్రలోభాలపర్వం మొదలైంది. ఇంకా ఎన్నికల నగారా మోగనేలేదు అప్పుడే ఎన్నికల సమయం ముంచుకొచ్చిందా అన్న రేంజ్ లో తాయిలాల జాతర సాగుతోంది. ఓటర్లను ఇప్పటి నుండే మచ్చిక చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే కొనసాగిస్తున్నారు నేతలు.
ఇదో రకం ముందు నుంచే తాయిలాలు..
నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గొడుగుల పంపిణితో దూసుకుపోతుంటే.. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నుండి టికెట్ దక్కుతుందని భారీ ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐ నేత కంది శ్రీనివాస్ రెడ్డి.. మూడు నెలల ముందు నుండే తాయిలాల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు పెళ్లిలు, శుభకార్యాల్లో పాల్గొంటూ సొంత ట్రస్ట్ పేరిట బహుమతులు అందజేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చీర సారెలతో బహుమానాల వర్షం కురిపించిన ఎన్ఆర్ఐ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అవగానే కొత్త రకం తాయిలాతో ముందుకొచ్చారు.
గడప గడపకు గిప్ట్లు..
తాజాగా కుక్కర్ల తాయిలాలతో గడప గడపకు గిప్ట్ లు చేరవేస్తూ అప్పుడే ప్రచార పర్వాన్ని మొదలెట్టాశారు కంది. కాంగ్రెస్ నుండి టికెట్ రేసులో ఉన్న ఈ యువ ఎన్ఆర్ఐ నేత ఈ మద్య బీసీ ఐక్య సభలో రగడకు కారణం అవడంతో సీనియర్లంతా ఈయనపై గుర్రుగా ఉండటం.. టికెట్ కందికి ఇవ్వొద్దంటూ అదిష్టానానికి మొరపెట్టుకోవడంతో.. పార్టీ టికెట్ రాకపోయినా స్వతంత్ర్య అభ్యర్థిగా అయినా బరిలో నిలిచేలా పక్కా వ్యూహాలతో దూసుకెళ్లేందుకే ఈ తాయిలాలన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే వినిపిస్తోంది.
అదిష్టానం దృష్టిలో పడితే..
ఎస్టీ నియోజక వర్గాల్లో సైతం తాయిలాల జాతర కొనసాగుతుందన్న ప్రచారం సాగుతోంది. ఖానాపూర్ , బోథ్ , ఆసిపాబాద్ లోను కొత్త నేతలు తమ తమ భవిష్యత్ ను పరిక్షీంచుకునేందుకు ఇప్పటి నుండే తాయిలాలు అందిస్తున్నారంట. ముధోల్ నియోజక వర్గంలో అయితే అదికార పార్టీకి చెందిన ఓ నేత సైతం ఇదే దారిని ఎంచుకోవాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. అదిష్టానం దృష్టిలో పడితే చివరి నిమిషంలో అయినా లాభం చేకూరుతుందనే ఆశతో ప్రజలను ఇప్పటి నుండి తాయిలాల వర్షంలో ముంచెత్తుతున్నారంట.
అంతా సిద్ధంగా గోదాంలలో..
ఇక బెల్లంపల్లి నియోజక వర్గంలోనూ ఓ నేత కుట్టుమెషిన్లు, గోడ గడియారాలు, కుక్కర్లు తెప్పించి జిల్లాలోని సమీప గోదాంలో నిల్వ చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలవడం.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కృతనిశ్చయంతోనే ఇలా తాయిలాల జాతరకు తెరలేపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
అది నిజమేనంటూ కొందరు నేతలు బహిరంగంగానే ప్రజలకు తాయిలాలు ఇవ్వడం సాగుతోంది. చూడాలి మరీ ఆలూ లేదు సూలు లేదు అప్పుడే తాయిలాలంటే ప్రజలు ఆయా నేతలకు ఓట్ల వర్షం కురిపిస్తారా.. లేక ఇప్పుడే ఇన్ని ఇస్తున్నారు.. ఎన్నికల సమయంలో ఇంకా దండిగానే ఇస్తారని ఆశపడి ఆయా నేతలను నిండా ముంచుతారా చూడాలి.