ఏపీలో ప్రముఖ క్షేత్రం సింహాచలంలో జరిగిన గిరి ప్రదర్శనలకు భక్తులు పోటెత్తారు. గిరి ప్రదక్షిణ మహత్తర ఘట్టంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఇక.. గిరిప్రదక్షిణ వేడుకతో విశాఖలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఏపీలో ప్రముఖ క్షేత్రం సింహాచలం. ఆషాడ పున్నమికి ముందు అత్యంత వైభవంగా జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం సింహగిరి శ్రీ సింహాచల క్షేత్ర నృసిహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవంలో భక్తులు పోటెత్తారు. గిరి ప్రదక్షిణ మహత్తర ఘట్టంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఇక.. గిరిప్రదక్షిణ వేడుకతో విశాఖలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. గిరి ప్రదక్షిణ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు సింహాచలానికి తరలి వచ్చారు. భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రతిఏటా ఆషాడ మాస శుక్లపక్ష చతుర్దశి రోజున సింహగిరి ప్రదక్షిణ చేసిన భక్తులు పౌర్ణమి రోజున సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.. ఎప్పట్లాగే ఈ సారి కూడా పుష్ప రథాన్ని ప్రారంభించి గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు.
తొలి పావంచా వద్ద విశాఖ నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అశేష భక్తజనం రథాన్ని అనుసరించారు. సింహాచలం కొండ చుట్టూ ఉన్న అడవివరం, హనుమంతవాకా, అప్పుఘర్ రహదారిలో భారీ సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ అప్పన్న గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు మజ్జిగను, అల్పాహారాన్ని పలు స్వచ్చంధ సంస్థలు అందించారు. భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపు నిర్వహించారు.
భారీగా బృందాలుగా తరలివచ్చిన భక్తులు సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి అర కిలోమీటర్‌కు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలు, టేబుళ్లు సిద్ధం చేశారు. ఇక.. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. అయినప్పటికీ.. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వేపగుంట జంక్షన్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.