తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు బుధవారం (జూన్ 21) ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిన్న తొలకరి జల్లులు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది..
తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు బుధవారం (జూన్ 21) ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిన్న తొలకరి జల్లులు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలగిరిలో 3.4 సెంటీమీటర్లు, పటాన్‌చెరువులో 2.9 సెంటీమీటర్లు, మాదాపూర్, గచ్చిబౌలిలో 2.7 సెంటీమీటర్లు, హాఫిజ్‌పేట్‌లో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డగుట్ట, సఫిల్‌గూడ, జూబ్లిహిల్స్లలో అతి తక్కువగా 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఎర్రమంజిల్, అమీర్‌పేట్, లక్డీకఫూల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, పరేడ్ మైదానం, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు, తుంపర్లు పడ్డాయి. ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి, నాంపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కోఠి, అబిడ్స్, బేగంబజార్, బషీర్‌బాగ్, హిమాయత్నగర్లలో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇక చంద్రాయణగుట్ట, హైదరాబాద్ పాతబస్తీ, ఫలక్‌నుమా, చంపాపేట్, సరూర్‌నగర్, సంతోష్‌నగర్, సైదాబాద్ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కూకట్‌పల్లిలో చిరుజల్లులు కురిశాయి.
నిన్న రాత్రి కురిసిన వానకు నగరంలో పలుచోట్ల స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఇక తొలకరి వాన జల్లులవల్ల రాష్ట్ర వాసులకు ఉపశమనం లభించినట్లైంది. గత కొంత కాలంగా ఎన్నడూలేని విధంగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. వేసవి తాపానికి అధిక ఉష్ణోగ్రతలకు, ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరైన జంట నగరాల వాసులు బుధవారం నైరుతి రుతుపవనాల రాకతో సేదతీరారు. రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులు కమ్ముకుని, చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.