ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో.. గవర్నర్ తమిళిసై గురించి మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకున్న కౌశిక్ రెడ్డి… ఇప్పుడు రైతుల విషయంలోనూ అదే పంథాలో మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు. రైతు దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో.. గవర్నర్ తమిళిసై గురించి మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకున్న కౌశిక్ రెడ్డి… ఇప్పుడు రైతుల విషయంలోనూ అదే పంథాలో మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు. రైతు దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి మూడు నెలలైనా ఎందుకివ్వలేదని రైతులు కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో చిర్రుబుర్రులాడారు కౌశిక్ రెడ్డి. రైతుపై కోపంతో ఊగిపోతూ నోరు జారారు. రైతు బంధు తీసుకోవడం లేదా.. పింఛన్ తీసుకోవడం లేదా కూర్చో ముందు కూర్చో.. అంటూ అభ్యంతరకరంగా మాటలు విడిచిపెట్టారు.
కౌశిక్ రెడ్డి మాటలతో.. రైతులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతు కూడా తన వాదనలు వినిపిస్తున్న క్రమంలో జై కేసీఆర్ అంటూ సమావేశాన్ని ముగించి అక్కడి నుండి వెల్లిపోయారు. మిగతా నాయకులు.. కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు. కానీ.. రైతులు మాత్రం కౌశిక్ రెడ్డిపై ఉన్న కోపాన్ని వెళ్లగక్కారు. రైతుల కోసం నిర్మించిన భవనంలోనే ఓ రైతును ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనూ పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విషయంలో నోరు జారారు. బిల్లులకు ఆమోదం తెలపకుండా.. తన దగ్గరే పెట్టుకున్నారంటూ.. అభ్యంతరకర పదజాలాన్ని వాడారు. మళ్లీ ఇప్పుడు రైతులపై నోరుజారటం.. అది కూడా రైతు దినోత్సవ సభలో జరగటం.. వివాదాస్పదంగా మారింది.