Team India: లండన్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు తమ కొత్త అడిడాస్ కిట్ ధరించి ప్రాక్టీస్ ప్రారంభించారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భారత క్రికెట్ జట్టులోని కొందరు ఆటగాళ్లు బిజీగా ఉండగా.. మరికొందరు ఆటగాళ్లు లండన్ చేరుకున్నారు. IPL 2023 ముగిసిన వెంటనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (ICC WTC Final)మొదలుకానుంది. ఇందుకోసం భారత కోచ్ రాహుల్ ద్రవిడ్, శార్దూల్ ఠాకూర్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ సహా ఓ బృందం లండన్ చేరుకుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే మరో బ్యాచ్ భారత్ నుంచి బయలుదేరనుంది. లండన్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు కొత్త అడిడాస్ కిట్ ధరించి ప్రాక్టీస్ ప్రారంభించారు.
బీసీసీఐ గతంలో జర్మన్ స్పోర్ట్స్ గూడ్స్ కంపెనీ అడిడాస్‌తో కిట్ స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు ధరించిన జెర్సీపై అడిడాస్ కంపెనీ లోగో కనిపించింది. ఈ కొత్త లోగో ఉన్న జెర్సీలు ధరించి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తారు. ఈ ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ చారిత్రాత్మక పోరుకు సాక్ష్యం కానుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించింది.