ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. కోవిడ్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో రెండేళ్ల పాటు కాస్త చప్పగా సాగిన ఐపీఎల్ ఈసారి మాత్రం దుమ్మురేపుతుంది.
ప్రతీ మ్యాచ్ ఆసక్తిగా సాగడంతో పాటు స్టేడియాలన్ని ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఇక టీఆర్పీ రేటింగ్ అయితే మునుపెన్నడు లేని విధంగా రికార్డులు సృష్టిస్తోంది.
మరో వారంలో లీగ్‌లో తొలి దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అయితే 16వ సీజన్ ప్రారంభంలో కేవలం లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్ చేసిన బీసీసీఐ తాజాగా శుక్రవారం ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ తేదీలు, వేదికల వివరాలను వెల్లడించింది.
ఐపీఎల్ 16వ సీజన్లో లీగ్ మ్యాచ్‌లు మే21తో ముగియనున్నాయి. అనంతరం మే 23న(మంగళవారం) తొలి క్వాలిఫయర్, మే 24న(బుధవారం) ఎలిమినేటర్ మ్యాచ్, మే 26న(శుక్రవారం) క్వాలిఫయర్-2 జరగనున్నాయి. ఇక మే 28న(ఆదివారం) ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా తొలి క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ట్విటర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది.
IPL 2023 ప్లే-ఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్:
మే 23(మంగళవారం) – క్వాలిఫయర్-1 మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు
మే 24(బుధవారం) – ఎలిమినేటర్ మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు
మే 26(శుక్రవారం) – క్వాలిఫయర్-2 మ్యాచ్, వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు
మే 28(ఆదివారం) – ఫైనల్ వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు