IPL 2023- Delhi Capitals- Ricky Ponting- Sourav Ganguly: ఐపీఎల్-2023 సీజన్లో ఇంత వరకు విజయాల ఖాతా తెరవని ఒకే ఒక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్.
2020లో ఫైనల్ చేరిన ఢిల్లీ మళ్లీ ఆ స్థాయిలో ఇం తవరకు రాణించింది లేదు. మూడేళ్ల క్రితం ఫైనల్ వరకు వెళ్లిన ఢిల్లీ ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఆ మరుసటి ఏడాది ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక 2022లో మాత్రం కనీసం టాప్-4లో నిలవలేకపోయింది. 14 మ్యాచ్‌లకు గానూ ఏడింటి గెలిచిన ఢిల్లీ 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక తాజా ఎడిషన్‌లో మరీ ఘోరంగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది.
దెబ్బ మీద దెబ్బ
ఈ నేపథ్యంలో ఏడాదికేడాది మెరుగవ్వాల్సింది పోయి ఇలా దిగజారమేమిటని అభిమానులు మండిపడుతున్నారు. కాగా రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరం కావడం.. పృథ్వీ షా వంటి స్టార్ ప్లేయర్ల వరుస వైఫల్యాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. పంత్ స్థానంలో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన డేవిడ్ వార్నర్ తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. సారథిగా ఆశించిన మేర రాణించలేక చతికిలపడ్డాడు.
ఇక కోచింగ్ స్టాఫ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉండగా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందిస్తున్నాడు. మరోవైపు షేన్ వాట్సన్, జేమ్స్ హోప్స్, అజిత్ అగార్కర్, ప్రవీణ్ ఆమ్రే, బిజూ జార్జ్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
జంబో స్టాఫ్‌నకు స్వస్తి.. పాంటింగ్ పదవికి ఎసరు!
తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో కోచింగ్ స్టాఫ్‌ను తగ్గించుకునే ఆలోచనలో పడిందట ఫ్రాంఛైజీ. జంబో స్టాఫ్‌ను తగ్గించడం సహా రిక్కీని హెడ్‌కోచ్‌గా కొనసాగించాలా లేదా అన్న విషయంపై కసరత్తు చేస్తోందట. ఈ మేరకు.. ”కచ్చితంగా మార్పులు ఉండబోతున్నాయి.
అయితే, సీజన్ మధ్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్లు జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూప్ సభ్యులు కలిసి కూర్చుని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి వచ్చే ఏడాది ఈ జంబో కోచింగ్ స్టాఫ్ కనుమరుగై పోవచ్చు. ముఖ్యంగా కొన్ని పెద్ద తలకాయలు ఇకపై జట్టుతో కొనసాగకపోవచ్చు” అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
2018 నుంచి ఢిల్లీతో
దీంతో పాంటింగ్ పదవి పోయే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆర్సీబీ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. గతంలో విజయాలకు క్రెడిట్ తీసుకున్న రిక్కీ పాంటింగ్ ఓటములకు కూడా బాధ్యత వహించాలంటూ విమర్శించిన విషయం తెలిసిందే. కాగా రిక్కీ పాంటింగ్ 2018 నుంచి ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.