ఒక తల్లి కడుపునా పుట్టకపోయినా బాంధవ్యంతో అతుక్కుపోయారు. ఒకే గురువు వద్ద విద్య నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే మాటలతో కత్తులు దూసుకుని వైరం పెంచుకున్నారు. ఏకమైన తర్వాత సమాజాన్ని ఏలారు. కొబ్బరిచెట్లకు పద్యాలు వినిపించి అవధాన ప్రక్రియలో రాటు దేలారు. ఒక్కటిగా నడిచేవారు. ఒక్కటిగా చెప్పేవారు. ఒకరు మరణించినా ఇద్దరి పేరునే రచనలు వెలువడేవి. చదువరులను ఆశ్చర్యపరచేవి. చనిపోయిన ముప్పది ఏళ్ల తర్వాత కూడా తన పేరుతో పుస్తకాలు వెలువరించుకున్న ధీశాలి దివాకర్ల తిరుపతి శాస్త్రి.
దివాకర్ల తిరుపతి శాస్త్రి 1872 మార్చి 26న జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకా, ఎండగండి గ్రామం వీరి జన్మస్థలం. తల్లి శేషమ్మ, తండ్రి వేంకటావధాని. వెలనాటి వైదిక కుటుంబం. పండిత వంశీయు లు. బారసాల నాడు పెట్టిన పేరు తిరుపతయ్య. సాహితీవనం లో వెలుగులు వెదజల్లటం మొదలయ్యాక తిరుపతి శాస్త్రిగా గుర్తింపు పొందారు. వీధిబడిలో చేరినప్పుడే సంస్కృత, సాహిత్య పండితుడైన బూర్ల సుబ్బారాయుడు వద్ద ‘రఘువంశ చరిత్ర’, ‘కుమార సంభవం’ లాంటి గ్రంథాలను ఔపోసన పట్టారు. గరిమెళ్ళ జంగయ్య, పమ్మి పేరిశాస్త్రిల వద్ద విద్య ప్రారంభిం చారు. కొద్ది రోజుల తర్వాత కడెద్దుల గ్రామంలోని కాశీ పండితులైన చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద వ్యాకరణాంశాలు నేర్చు కోవటానికి చేరారు. అక్కడ చేరిన ఐదు నెలల తర్వాత, చాలా మంది ఉపాధ్యాయుల అనంతరం చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి విద్య నభ్యసించటం కోసం చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చేరారు. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి కన్నా వయసులో కొంచెం పెద్ద. ఆ తర్వాత వేంకటశాస్త్రి కాశీ వెళ్ళ టానికి ప్రయాణమయ్యారు. వారించే ప్రయత్నం చేసినా విని పించుకోలేదు. అనేక అవస్థలు పడి కాశీ వెళ్లి, కొద్ది రోజులు గడిపి తిరిగి వెనక్కి వచ్చి ఆయన వద్దనే చదువు కొనసా గించారు. ప్రారంభంలో వారిద్దరూ అన్యోన్యంగా మెలిగినా, కొద్ది రోజులకు వాదనలు పెంచుకుని శత్రువులుగా మారారు. దానికి తోడు అప్పటికే కాశీ యాత్రలు చేసి వచ్చారు. తాను చెప్పిందే వేదం అన్న విధంగా వ్యవహరించేవారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునేవారు. అక్కడ చేరిన వారు కొందరు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిని బలపరిస్తే, కొందరు తిరుపతి శాస్త్రిని సమర్థించేవారు. వారిద్దరి మధ్య సఖ్యత పెంచటం కోసం బ్రహ్మయ్య శాస్త్రి ప్రయత్నం చేసి కొద్ది రోజుల తర్వాత ఇద్దర్నీ ఒకటి చేశారు. ఒకే మాట మీద నిలబడేలా చేశారు. అటు తర్వాత వారి మధ్య పొరపొచ్చాలు తలెత్తలేదు.
తిరుపతి శాస్త్రికి సంస్కృతంలోనే గాని, తెలుగులో ప్రవేశం లేదు. ఆంధ్ర భాషలో గుర్తింపు పొందిన వేంకట శాస్త్రి బడికి సరిగా పోయేవారు కాదు. తండ్రి ఆర్ధిక పరిస్థితి బాగుండక మానసికంగా క్షోభ చెందేవారు. తాతగారి గ్రంథాలయంలోని సంస్కృత పుస్తకాలు పఠిస్తూ కొంత నైపుణ్యం సంపాదించు కున్నారు. తిరుపతి శాస్త్రిలో వాదనాపఠిమ అసాధారణంగా వుండేదట. వేంకట శాస్త్రి ఉపన్యాసాలు ఇచ్చేవారట. అవధానా లు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందుకు అవకాశం రాలేదు. ఇద్దరూ ఏకాంతంగా ఒక కొబ్బరితోటలోకి వెళ్లి ఆ కొబ్బరిచెట్లను పృచ్చకులుగా భావించి అష్టావధానం వినిపించే వారట. కొబ్బరిచెట్లకు చేసిన అష్టావవధానం ఇచ్చిన స్ఫూర్తితో అష్టావధానాలే గాక శతావధానాలు, సహస్రావధానాలు కూడా చేయగలమనే ధైర్యం తెచ్చుకున్నారు. అటు తర్వాత కాకినాడలో శతావధానం చేసి ప్రజల్ని మెప్పించారు. అప్పటికి తిరుపతి శాస్త్రికి 19 ఏళ్ళు కాగా, వేంకట శాస్త్రికి 20 ఏళ్ళట. కాకినాడ పౌరులు ఆ జంటక వులను మేళతాళాలతో ఊరేగించారు. ఇద్దరూ పండితవంశం నుంచి వచ్చినవారు కావటం, సాహిత్యంలో ఒక్కటి కావటంతో ‘తిరుపతి కవులు’గా చరిత్రలో నిలిచిపోయారు. అటు తర్వాత అసంఖ్యాకంగా అవధానాలు చేశారు. సన్మానాలు అందుకున్నారు. ‘‘ధాతు రత్నాకరం’’ అనే గ్రంథాన్ని రచించారు. జంటగా అడయారుకు వెళ్ళినప్పుడు అనీబిసెంట్ ప్రశంసలందుకున్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాల్లో సైతం అవధానం చేసి ప్రశంసలందుకున్నారు. పాలవరం జమీందారు వారి ప్రతిభను తెలుసుకుని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచిం చిన ‘లైట్ ఆఫ్ ఆసియా’ గ్రంథాన్ని తెలుగులోకి అనువదిం చమని కోరారు. తమ ఆసా ్థనంలో కవులుగా కొనసాగమని కూడా అన్నారు. అలా చేరటా నికి వేంకట శాస్త్రి వెనుకాడినా, తిరుపతి శాస్త్రి ఒప్పించారు. ఫలితంగా 1901లో వారు కాకినాడకు మకాం మార్చారు. 1889 నుంచి పిఠాపురంలో నడుస్తున్న ‘సరస్వతి’ అనే సాహిత్య మాసపత్రిక నిర్వహణా బాధ్యత వారికి అప్పగించబ డిరది. ‘బాల రామాయణం’, ‘ముద్రారాక్షసం’, ‘మృచ్చకటికం’ మొదలైన గ్రంథాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అను వదించి ముద్రించారు. తిరుపతి వేంకట కవులుగా గుర్తింపు పొందాక, మహాభారత కథతో ‘పాండవ జననము’, ‘పాండవ ప్రస్థానము’, ‘పాండవ రాజసూయము’, ‘పాండవోద్యోగము’, ‘పాండవ అశ్వమేధము’ లాంటి నాటకాలు రచించారు. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందినవి పాండవోద్యోగము, పాండవ విజయము. కాల గమనంలో ఆ రెంటినీ సంకలన పరచి ‘కురుక్షేత్రం’ పేరుతో నాటకంగా రూపొందించారు. ఈ నాటకా లు ప్రదర్శించని గ్రామం ఆంధ్ర ప్రాంతంలో లేదంటే అతిశ యోక్తి కాదు. ‘‘బావా ఎప్పుడొచ్చితీవు?. . . .’’, ‘‘జెండాపై కపిరాజు. .’’ అంటూ పద్యాలు ఆలపించని ఆంధ్రుడు లేడు. ఇవి నాటకం వరకే పరిమితం కాకుండా ఎన్నో చలనచిత్రాల్లో కూడా వినిపిం చబడ్డాయి. జంటకవులుగా రచనలు చేస్తున్న తరుణంలో విధి వక్రించింది. ఇద్దరినీ విడదీసింది. 1920 నవంబరులో దివాకర్ల తిరుపతి శాస్త్రి మరణించారు. అంతటితో ఆ జంటకవుల రచనా వ్యా సంగం ముగిసినట్లేనని చాలామంది అభిప్రాయపడ్డారు. జంట గా అవధానాలు చేసి, రచనలు చేసి పాఠకులను, శ్రోతలను ఆనందడోలికలలో ముంచిన ఇద్దరిలో ఒకరు మరణిస్తే మరొకరి వ్యాపకం ఆగిపోతుందని అభిలషించటంలో తప్పు లేదు. కాని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి ఆ తర్వాత కూడా రచనా వ్యాసంగం కొనసాగించారు. ఆంధ్రులు గర్వంగా చెప్పుకునే అంశం ఒకటుంది. సమాధానం దొరకని అంశం కూడా. తిరు పతి శాస్త్రి మరణానంతరం వేంకట శాస్త్రి రచించి వెలువరిం చిన గ్రంథాలపై కూడా ‘తిరుపతి వేంకట కవులు’ అని ముద్రించి వుండటం చాలామందిని ఆశ్చర్యంలో ముంచింది. వేంకట శాస్త్రి దాతృత్వానికి అది గుర్తుగా చరిత్రలో నిలిచిపోయింది. తిరుపతి శాస్త్రి మరణం తర్వాత తానొక్కడే సంస్కృతంలో పది గ్రంథాలను రచించారు. సంస్కృతం నుండి తెలుగులోకి 15 గ్రంథాలను వెలువరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్ల కథలను తెలుగులోకి అనువదించారు. తెలుగులో స్వతంత్ర కవితా రచనలు 25 వరకు చేశారు. తెలుగులో నాటకాలు, భారతం ఆధారంగా రూపొందించిన ఆరు నాటకాలే కాక, ‘పండితరాజం’, ‘ఎడ్వర్డ్ పట్టాభిషేకం’ ‘అనర్ఘ నారదము’, ‘దంభ వామనము’, ‘సుకన్య’, ‘ప్రభావతీ ప్రద్యుమ్నము’, ‘గజానన విజయము’ మొదలైన గ్రంథాలను వెలువరించారు. తెలుగు వచన రచనలుగా ‘భారత వీరులు’, ‘విక్రమ చెళ్ళపిళ్ళము’, సతీ జాతకము’ రచించారు. చిన్నవాడైన తిరుపతి శాస్త్రి 1920లో కాలం చేస్తే, పెద్దవాడైన వేంకట శాస్త్రి 1950 ఫిబ్రవరి 15న శివరాత్రి పండుగ రోజున స్వర్గం చేరారు.
– దాసరి ఆళ్వారస్వామి
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!