andhrapatrika : ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. మార్చి 31 సమీపిస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు హడావుడి పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు.అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 41,104 రీఫండ్ చేస్తున్నట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ రీఫండ్ పొందడానికి వ్యక్తిగత వివరాలను సమర్పించాలని ఆ మెయిల్ ద్వారా కోరారు.ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఖాతా-ఆడిట్‌ను పూర్తి చేసింది. మీకు రూ. 41,101.22 రీఫండ్‌కు అర్హత ఉంది.. కానీ మీ వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. పరిశీలించి సరిచేసుకోండి’ అంటూ ఓ లింక్ ట్యాబ్‌ను అందులో ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్, బెంగళూరు నుంచి ఆ ఈమెయిల్‌ను పంపుతున్నట్లు పేర్కొన్నారు.
అది పూర్తిగా ఫేక్..
ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చిన ఆ ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్‌మేషన్ బ్యూరో ( పీఐబీ) నిర్ధారించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ నుంచి అటువంటి ఈమెయిల్‌లను పంపలేదని తేల్చింది.ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినప్పుడు webmanager@incometax.gov.in లో తెలియజేయవచ్చు. ఐటీ శాఖ ఇలా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగదు. అలాగే క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాల కోసం పిన్ నంబర్‌లు, పాస్‌వర్డ్‌లు వంటివి కోరుతూ మెయిల్ పంపదు.
ఇలాంటి ఈమెయిల్ వచ్చినప్పుడు ఏమి చేయాలి?
వాటికి స్పందించవద్దు. అటాచ్‌మెంట్‌లు మీ కంప్యూటర్‌కు హాని కలిగించే హానికరమైన కోడ్‌ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిని తెరవవద్దు. ఎలాంటి లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు. ఒక వేళ మీరు లింక్‌లపై అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేయవద్దు.