✍️ *జి.వి.వి.ప్రసాద్*
*నల్లజర్ల:*Andhrapatrika :
కడుపులో పెరిగిన చిన్నపాటి నులిపురుగులు అనేక అనర్థాలకు దారితీస్తాయి. వీటి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రీయ బాలాస్వచ్చ కార్యక్రమంలో భాగంగా చిన్నారులైన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమంను ఈ నెల 14 వ తేదీ మంగళవారం నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 19 సంవత్సరాలు లోపు విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజనం ముగిసిన అనంతరం అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్రలను చప్పరించేలా చేస్తారు. ఆ బాధ్యతను ఉపాధ్యాయుల సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చేపట్టనున్నారు.
*నులి పురుగులు అంటే ఏమిటి? వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేమిటి?*
సన్నటి దారం లాంటి పురుగులు మన ప్రేగుల గోడలకు అంటి వుండి శరీరంలోని రక్తాన్ని పిలుస్తూ మనం తినే ఆహారం ను మనకు వంటపట్టకుండా చేస్తూ వుంటాయి. అంతేకాకుండా శరీరంలోని ఇతర అవయవాలకు కూడా హాని కలిగిస్తాయి. పిల్లల్లో సాధారణంగా మూడు రకాల నులిపురుగులు కనపడతాయి. అవి ఏలిక పాములు, నులిపురుగులు, కొంకిపురుగులు. ఇదే కోవలో 50 నుంచి 60 శాతం మంది ఏదో ఒక రకం నులిపురుగులు బారిన పడి రక్త హీనత, అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
*నులి పురుగులు ఎలా వ్యాపిస్తాయి?!*
కలుషిత ఆహారం మరియూ ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల వ్యాపించే అవకాశం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన ద్వారా అలాగే కాళ్ళకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లుకు వెళ్ళడం ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు వంటి సరుకులను పరిశుభ్రమైన నీటితో కడగకపోవడం వల్ల వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. భోజనం వండే వారు, వడ్డించే వారు తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడగకపోవడం వలన నులిపురుగులు వ్యాపించే అవకాశం ఉంటుంది. చేతి వేళ్ళ గోర్లు వుండటం వలన, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడ వలన, ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా వుండటం వలన అందులోనే పిల్లలు ఆడుకోవడం వల్ల అక్కడే నులిపురుగులు, లార్వాలు పిల్లలు జీర్ణకోశంలోకి నేరుగా ప్రవేశించడం వల్ల వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది.
*వ్యాధి లక్షణాలు ఇలా….*
రక్తహీనత, నీరసించడం, దగ్గు ఆయాసం వుండటం, ఎదుగుదల లేకపోవడం, మల మూత్ర విసర్జన ప్రదేశంలో దురద, చర్మంపై ఎర్రటి దద్దుర్లు అవి దురదరావడం, బరువుతగ్గడం, పోషకాహారలోపం, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించటం వంటివి వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.
*ఆల్బెండజోల్ కార్యక్రమం ఎలా చేయాలంటే…*
భోజనానికి గంట ముందు ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులకు, తల్లితండ్రులకు నులిపురుగుల వ్యాప్తి, నివారణ, మంచి ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలి. చేతులు శుభ్రపర్చుకోడం, వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల ఆహారంపై వివరించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకునేలా చూడాలి. భోజనం అనంతరం విద్యార్థులందరూ మాత్రలను చప్పరించి నమిలి మింగేలా ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారు. మాత్రలు వేసుకున్న వెంటనే వాంతులు, వికారము వచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, తాగునీటిని ఆందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో శారీరక మానసిక అభివృద్ధికి దోహదం పడటమే కాకుండా రక్త హీనత పోషకాహార లోపాన్ని నివారించేందుకు వీలవుతుంది.
*వ్యాధి నివారణ చర్యలు:*
నులిపురుగులు నివారణ చర్యల్లో బాగంగా ముఖ్యంగా, భోజనానికి ముందు, ఆటలాడిన తర్వాత అలాగే మల విసర్జన తర్వాత ప్రతిసారీ చేతులు సుమారు రెండు నిమిషాలు పాటు సబ్బుతో పరిశుభ్రత చేసుకోవాలి. అంగన్వాడి చిన్నారులకు, ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలు కళాశాలల్లో 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను నిబంధనల మేరకు వెయ్యాలి. సంవత్సరం నుండి రెండేళ్ల పిల్లల వరకూ సగం మాత్రలను పొడిచేసి చిన్న గ్లాస్ నీటిలో వేసి కలిపి త్రాగించాలి. 3 సంత్సరాల నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సు వున్న వారికి ఒక పూర్తి ఆల్బెండజోల్ మాత్రను చప్పరిస్తూ నమిలి మింగించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రను వేసుకోవాలి. సంవత్సరం లోపు వయస్సు వారికి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, కాలేయ వ్యాధిగ్రస్తులకు, ఉదర సంబంధ క్యాన్సర్ వున్న వారికి, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధి వున్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వరాదు. ముఖ్యంగా, మన ఆరోగ్యం.. మన భవిష్యత్… మన చేతుల్లోనే ఉందని ప్రతీ ఒక్కరూ గమనించాలి. పరిశుభ్రత పాటిద్దాం! ఆల్బెండజోల్ మాత్రలు వేసుకుందాం!! నులిపురుగులను నిర్మూలిద్దాం!!! ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మిద్దాం!!!!
————–++++++———-
*కంటికి కనిపించని ప్రథమ శత్రువు.. ఆరోగ్యానికి హాని కలిగించే నులిపురుగు!: డాక్టర్ గంగాధరరావు*
ఇది మనిషి ప్రేగుల్లోకి చేరి రక్తాన్ని పీల్చి పిప్పి చేసి రక్తహీనతకు గురి చేస్తుందని నల్లజర్ల ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ తెల్లం గంగాధరరావు తెలిపారు. ఇది చిన్న సమస్యేమీ కాదని, ఈ నులిపురుగుల వల్ల భావి భారతపౌరులైన చిన్నారుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆయన వివరించారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
*విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా… సి.హెచ్.ఓ చంద్రశేఖరరాజు*
విద్యార్థులను నులిపురుగుల భారి నుంచి రక్షించేందుకు అంగన్వాడీ, ప్రాధమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు 19 ఏళ్ల లోపు కళాశాల విద్యార్థులందరికీ ఆశా, ఆరోగ్య కార్యకర్త, ఉపాధ్యాయులు సహకారంతో నులిపురుగుల మాత్రలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నల్లజర్ల ప్రభుత్వాసుపత్రి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కలిదిండి వెంకట చంద్రశేఖరరాజు వివరించారు.