Amit Shah Tour , Andhrapatrika : ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చినా… బీజేపీలో మాత్రం రాజకీయ వ్యూహాల సందడి ఉంది. ఈ టూర్ మైలేజీ ఇస్తుందా?కేంద్ర హోమంత్రి అమిత్ షా… CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) రైజింగ్ డేలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 7.30కి ఆయన.. సీఐఎస్ఎఫ్ రైజింగ్‌డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 9.15 వరకు ఆయన పరేడ్ కార్యక్రమంలోనే ఉంటారు. ఆ తర్వాత తిరిగి… గత రాత్రి బస చేసిన నిసాకు వెళ్తారు. ఉదయం 11.35 వరకు నిసాలో ఉంటారు. తర్వాత.. 11.40కి నిసా నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో హకీంపేట ఎయిర్‌ఫీల్డ్‌కు వెళతారు. 11.50కి ప్రత్యేక విమానం ఎక్కి.. కేరళలోని కోచికి వెళతారు. ఇలా ఇవాళ అమిత్ షా టూర్ ఉండనుంది.
ఈ కార్యక్రమం కోసం అమిత్‌షా శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ వచ్చారు. ఆయనకు హకీంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితర కీలక నేతలు స్వాగతం పలికారు. తర్వాత రోడ్డు మార్గంలో నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ – నిసా (NISA)కి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ తాజా రాజకీయాలపై చర్చించారు. ఎమ్మెల్సీ కవిత అంశం, అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ వ్యూహాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. ఇవాళ కూడా పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.సరిగ్గా అమిత్ షా వచ్చిన సమయంలోనే… బండి సంజయ్‌కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలూ ఆందోళనలు చేయడం ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమే అనుకోవచ్చు. ఎమ్మెల్సీ కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇది బీజేపీకి ఒక రకంగా మైనస్ పాయింట్ అంటున్నారు. రాజకీయ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. సద్విమర్శలు చేయాలి గానీ.. అసంబద్ధంగా మాట్లాడటం ఏ పార్టీ నేతలకూ మంచిది కాదని అంటున్నారు. ఇవాళ అమిత్ షా చూపించే దిశా నిర్దేశం, చెప్పే సూచనలను బట్టీ… బీజేపీ నెక్ట్స్ అడుగులు ఉండనున్నాయి.