మొన్నటి ప్రీతి మరణం..రక్షిత ఆత్మహత్య వరకు మహిళలకు రక్షణ లేదన్న విషయం మనకు మరోమారు గుర్తు చేసింది. మహిళలకు అపకారం తలపెడితే..మన జీవితం అంతే సంగతి అన్న భయం కల్పించడంలో ప్రభుత్వాలు, సమాజం విఫలం అయ్యాయి. దేశం యావత్తూ ఇదే దుస్థితి నెలకొంది. నిర్భయ కేసు నుంచి నేటి వరకు అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడితే కఠిన శిక్ష అనుభవిస్తారన్న భయం లేకుండా పోయింది. మహిళలు ధైర్యంగా రోడ్డెక్కలేని పరిస్థితులు నేటికీ దాపురించాయి. రోడ్డుపై తిరుగుతున్న మృగాల వల్ల వారికి రక్షణ లేకుండా పోతోంది. ఇదో రకమైతే గృహహింస, వరకట్నం వేధింపులు వంటివి ఇంకా సమిసి పోలేదు. ఆస్తిలో సమానహక్కు చట్టం సోదరుల చేతిలో అభాసుపాలవుతోంది. ఆడపిల్లలకు చట్టప్రకారం ఇవ్వాల్సిన ఆస్తిని పంచి ఇవ్వడం లేదు. ఏటా మహిళా దినోత్సవాలు జరుపుకోవడం.. అట్టహాసంగా వారిని స్మరించడం..సన్మానించడం రివాజుగా మారింది. కానీ సమాజంలో మార్పు మాత్రం కానరావడం లేదు. జరుగుతన్న తప్పిదాలను సవిూక్షించి వాటిని పరిష్కరించే చొరవ ప్రభుత్వాల్లో కానరావడం లేదు. ఈ క్రమంలో మహిళలే దండయాత్ర చేయాలి. మృగాళ్ల భరతం పట్టాలి. సామాజిక పరివర్తనకు కృషి చేయాలి. ఏటా మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. వారికి అండగా ఉండాలని, వారిని సమున్నతంగా గౌరవించుకోవాలని చెబుతుంటాం. అయినా ఏడాది పొడుగు నా రోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎపిలో దిశ చట్టం తీసుకుని వచ్చినా…ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తీసుకుని వచ్చినా మార్పు కానరావడం లేదు. తెలంగాణలో షీ టీమ్స్‌తో కొంత మార్పు వచ్చింది. అయినా అఘాయిత్యాలు ఆగడం లేదు. దీనికి చట్టాలను, పాలకులను నిందించడం సరికాదు. ఎందుకంటే సమాజం కలుషితం అయ్యింది. మనుషుల్లో మానవత్వం లోపించంది. మహిళలను తల్లిగా, చెల్లిగా చూడడంతో పాటు..తన జన్మకు ఓ తల్లి కారణమన్న వివేచన మరచి మృగాళ్లు ప్రవర్తిస్తున్నారు. మన విద్యా విధానంలో లోపంతో పాటు..వారికి నైతిక విలువలతో బోధించే చదువులు కొరవడ్డాయి. దీనిని పాలకులు గమనించి నైతిక విలువలను రంగరించి పోసేలా విద్యావిధానం రూపొందిం చాలి. మహిళల పట్ట మంచిగా మెలిగేలా సమాజంలో మార్పులకు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. స్త్రీల పట్ల ఆరాధన భావం తల్లి భావం అన్నవి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇంటినుంచే మహిళల పట్ల ఆరాధనా భావం అలవడేలా తల్లిదండ్రలు పిల్లలకు బోధించాలి. చదువుకన్నా ముఖ్యం సంస్కృతి అన్నది తెలిపాలి. ఇవన్నీ మృగ్యం కావడం వల్లనే, కుటుంబ వ్యవస్థ నశించడం వల్లనే మనుషులు మృగాలుగా మారుతున్నారు. మానవ సంబధాలు మరచి పోయి పశుప్రవృత్తికి లోనవుతున్నారు. ఇదో రకమైన జబ్బుగా గుర్తించాలి. ఇలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేస్తూ పోతుంటే తప్ప సమాజంలో పరివర్తన అన్నది రాదు. సమాజంలో పరివర్తన కోసం ప్రయ త్నాలు సాగాలి. నిర్భయ చట్టం కోరలు లేదన్న విషయం తెలుస్తోంది. ఆడవాళ్లపై చేయివేస్తే చేయి తెగుద్ది అన్నరీతిలో చట్టాలు ఉండాలి. అలాగే మన వేషభాషలు, సినిమాలు, సీరియళ్లు స్త్రీని కించపరిచేవిగా తప్ప గగౌరవం పెరగేలా చేయడం లేదు. భారత దేశంలో మహిళలపై లైంగిక దాడులు వెలుగు చూస్తున్న తీరు మన సంస్కృతిని దెబ్బతీసేదిగా, మహిళల పట్ల మనకున్న గౌరవాన్ని తక్కువ చేసేదిగా ఉంటోంది. మృగాళ్లుగా మారుతున్న కొందరి అసభ్య ప్రవర్తనలు మనం తలదించుకునేలా చేస్తోంది.ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపు కుంటున్నా సమాజంలో మార్పు రావడం లేదు. చిన్నపిల్లల పైనా పశుప్రవృత్తితో వ్యవహరిస్తున్నారు. దారుణ హత్యలు, మానభంగాలు మహిళా లోకాన్ని అవమాన పరిచేలా ఉన్నాయి. మహిళల అభివృద్ధిని,
ఆధిక్యాన్ని, స్వాతంత్య్రాన్ని అంగీకరించలేని పురుషాధిక్య భావజాలం ఉన్నవారూ ఇంకా అనేకమంది ఈ సమాజంలో ఉన్నారు. వారు ఏ కాలంలో అయినా ఉంటూనే ఉంటారు. మిత్రులతో బయటకు వెళ్ళేవారు, ఆధునిక దుస్తులు వేసుకునే వారు దిగజారిపోయిన వారనీ, వారిని వేధించ డంలో తప్పులేదనే భావన ఇటీవల పెరిగిపోతున్నది.తెలియనివి, బయటకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికి కారణం సంస్కారం లేకపోవడం. మన చదువుల్లో స్త్రీ పట్ల సంస్కారం, గౌరవం,ఆరాధన,ప్రేమ అన్నభావనలు లేకుండా చేయడం వల్ల ఇలాంటి పెడధోరణులు మన సమాజాంలో పెరిగాయి. వీటి గురించి పట్టించుకోక పోవడం వల్ల సమాజం పెడదోవ పడుతోంది. దీనికి కూడా మన విద్యావ్యవస్థ కారణమని చెప్పకతప్పదు. వేష భాషల గురించి మాట్లాడితే తప్పుపడుతున్న మహిళా సంఘాలు పర్యవసానాలను గమనించడం లేదు. మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో సమభాగం కోసం కృషి చేస్తున్నారు. చదువు కోవడం, ఉద్యోగాలు చేయడం మాదిరిగానే అన్ని వేడుకలకూ హాజరవుతున్నారు. అయితే కాలానుగుణంగా మారని కొందరి ఆలోచనల వల్ల ఇలాంటి పెడధోరణులు వస్తున్నాయి. ఒంటరిగా వెళుతున్న యువతుల పై దుండగులు వెంటపడి అకృత్యానికి పాల్పడుతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. దుండగులు నిస్సం కోచంగా యువతులపై దాడులకు పాల్పడిన తీరును తీవ్రంగా పరిగణించవలసిందే. నీచంగా ప్రవర్తించడం అన్నది పశు ప్రవృత్తికాక మరోటి కాదు. మహిళలపై అకృత్యాల దృశ్యాలను సంచలనాత్మకంగా అదేపనిగా ప్రసారం చేయడం టీవీ ఛానళ్లకు కూడా మంచి పద్ధతి కాదు. ఈ నేరాలకు మూల కారణాలు ఏమిటనే విశ్లేషణాత్మక చర్చ సాగించి, దానికి విరుగుడు కనిపెట్టాలి. మహిళా సాధికారత సంగతేమో వారి కనీస హక్కులు మృగ్యమయ్యాయి. స్త్రీలు, విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలపై దాడులను యథేచ్ఛగా కొనసాగిస్తూ, వారి హక్కులను కాలరాస్తూ, మహిళా సాధికారత సాధిస్తామనడం సరికాదు. భారతీయ సమాజం విలువలు కాపాడేలా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి రాజకీయంగా హక్కుల కల్పనకు పోరాడాలి. ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్ల మదోన్మాదం, కుటుంబ సభ్యుల కామ దాహం, అధికారులు, సహోద్యోగుల వికృత చేష్టలు వాళ్ల పాలిట శాపాలవుతున్నాయి. దీనికి తోడు మత ఛాంద సవాదం మహిళా సమానత్వానికి మరింత హానికరంగా తయారైంది. భ్రూణ హత్యల కారణంగా దేశంలో క్షీణిస్తున్న అమ్మాయిల నిష్పత్తి ఆందోళన కలిగిస్తోంది. వీటన్నింటిని ప్రజలు, సమాజం ఆలోచన చేయాలి. నైతిక విలువలను చిన్ననాటి నుంచి బోధించే పాఠ్యాంశాలను ప్రేవేశ పెట్టాలి. నైతికతకు సంబంధించిన పాఠ్యాంశాన్ని తప్పనిసరిచేయాలి. అలా చేస్తూ పోతే కొంతకాలానికైనా మార్పు వస్తుందని ఆశించవచ్చు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!