ఐక్యరాజ్యసమితి సమావేశానికి కల్పిత దేశం కైలాస దేశ ప్రతినిధి హాజరయ్యారు. అత్యాచార నిందితుడు, స్వయం ప్రకటిత దైవం నిత్యానంద స్థాపించిన కాల్పనిక దేశం కైలాస ప్రతినిధి UN సమావేశానికి హాజరవడం అందరిని ఆశ్చర్యానకిి గురి చేసింది.
ఈ సమావేశంలో భారత్‌పై విషం చిమ్మదుకు దొరికి అన్ని అవకాశాలను వినియోగించుకుంది. నిత్యానంద ‘హిందూమతంలో అత్యున్నత గురువు’ అని కైలాస దేశ ప్రతినిధి తెలిపారు. నిత్యానందకు భద్రత కల్పించాలని ఐక్యరాజ్యసమితి సమావేశంలో డిమాండ్ చేశారు.
విజయప్రియ నిత్యానంద అనే మహిళ నిత్యానందను సమర్థించేందుకు యూఎన్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (CESR) నిర్వహించిన 19వ సమావేశానికి హాజరయ్యారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ స్థాపకుడు నిత్యానందను భారత్ వేధింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు. కైలాసాన్ని హిందూమత తొలి సార్వభౌమ రాజ్యంగా అభివర్ణించారు విజయప్రియ. రెండు మిలియన్ల నిత్యానంద భక్తులను హింసించడాన్ని ఆపాలని పిలుపునిచ్చారు విజయప్రియ నిత్యానంద.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు
ఈ సమావేశంలో, తాను 150 దేశాలలో రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలను స్థాపించినట్లు కూడా పేర్కొన్నారు విజయప్రియ నిత్యానంద. అయితే కైలాసాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. అది గుర్తించబడితే, ఏ ప్రక్రియ ద్వారా నిత్యానందను ఊహాజనిత దేశానికి రాజుగా మార్చారు..? అనేది తేలాల్సి ఉంది.
ఎన్నో ఆరోపణలు..
అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్నాడు. 2010లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. బెయిలుపై బయటకు వచ్చాడు. ఆ తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలపై నిత్యానందను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. 2019 నవంబర్‌లో గుజరాత్ పోలీసులు అతను పరారీలో ఉన్నాడని ప్రకటించింది. అతని ఆశ్రమంలో పిల్లల కిడ్నాప్‌కు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.భారత్ నుంచి పారిపోయిన..
అత్యాచార ఆరోపణలు, ఆశ్రమంలో ఏనుగు దంతాలు, పులి చర్మాల స్మగ్లింగ్‌తో పాటు పలు రకాల కేసులు ఆయనపై నమోదయ్యాయి. వాటన్నిటి నుంచీ తప్పించుకునేందుకు ఇండియా నుంచి పరారైన నిత్యానంద.. కైలసం పేరుతో దేశాన్నే ఏర్పాటు చేసి.. తనకు తానే ప్రధానిగా ప్రకటించుకున్నారు. బయటి ప్రపంచానికి కనిపించకుండా జీవితం గడుపుతున్నారు. 2019 నవంబర్‌లో ఆయన భారత్ వదిలి వెళ్లిపోయారు. ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది. ఆ దీవికి కైలాస దీవి అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆయన బయటి ప్రపంచానికి కనిపించింది లేదు. కానీ ఆయన వివరాలు, కార్యక్రమాలు మాత్రం సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏకంగా చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిని ఖండిస్తూ ప్రకటన వచ్చింది.
ఇదిలావుంటే, అక్టోబర్ 2022లో బ్రిటన్‌లోని కన్జర్వేటివ్ ఎంపీలు పార్లమెంటులో దీపావళి పార్టీకి హాజరు కావాల్సిందిగా నిత్యానంద మద్దతుదారులను ఆహ్వానించినప్పుడు విమర్శలను ఎదుర్కొన్నారు. నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ఇంటర్‌పోల్ నిరాకరించింది.అయితే, ఒక కల్పిత దేశ ప్రతినిధిని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి అనుమతించడమనేది ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం కాదా? రెండవ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఉనికి తెలియని దేశం, తమ ప్రతినిధులను ఐరాస సమావేశానికి అనుమతించడం ఐక్యరాజ్యసమితి సూత్రాలను అవమానించడం కాదా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.