టిడిపి బాటలోనే వైసిపి.
పులీ పాయే వర్షమూ లేదాయే!
అయినా ప్రారంభం కాని రోడ్డు పనులు.
మార్చి1న ఎంపిడిఓ ఆఫీస్ వద్ద వంటావార్పుతో నిరసన.
హెచ్చరించిన సీపీఎం నేత చల్లా జగన్.
వేపాడ ఫిబ్రవరి 26( ఆంధ్ర పత్రిక):- ప్రభుత్వాలు పాలకులు మారినా వారి తలరాతలు మాత్రం మారలేదు. నాడు టీడీపీ నేడు వైసీపీ పాలకుల తీరులో ఎటువంటి మార్పు లేదు. జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతమైన వేపాడ మండలం లో గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయమని చెప్పక తప్పదు. మండలంలో గిరిజనుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు సౌకర్యాలు అందడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరంతా ఐటీడీయే పరిధిలోకి రాకపోవడం ఒక ఎత్తు అయితే రహదారి సౌకర్యం కూడా లేకపోవడం విచారకరం. ఇందులో మండలంలోని కరకవలస పంచాయతీ శివారు ప్రాంతమైన మారిక గిరిశిఖర వాసులకు రహదారి సౌకర్యం లేక దశాబ్దాల తరబడి విద్య వైద్యం సరిగా అందక అనునిత్యం అవస్థలు పడుతూనే ఉన్నారు. కానీ అధికారంలోకి ఏపార్టీ వచ్చినా గిరిజనుల గోడు ఎవరికీ పట్టలేదు. అడగక పోయినా పచ్చటి పంట పొలాల్లో గ్రీన్ ఫీల్డ్ పేరుతో హైవేలు నిర్మిస్తున్నపాలకులు రోడ్డు నిర్మించండి మహా ప్రభో అని మారికగిరిజనులు వేడుకున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో సీపీఎం నేత చల్లా జగన్, ఏపీ దళిత కూలీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ తాడి అచ్చారావు తదితరులు పలు మార్లు గిరిజనుల తరుపున ఆందోళనలకు దిగగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పందించి మారికకొండపైకి రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబందిత కాంట్రాక్టర్ కరకవలసగ్రామం నుంచి మారికకొండ దిగువభాగం వరకు తారు రోడ్డు నిర్మించి కొండపైకి రోడ్డు నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతులు లేవంటూ చేతులెత్తేశారు.ఆ తర్వాత పాలకులు పట్టించుకొకపోవడంతో రోడ్డు పనులు పూర్తిగా నిలిచి పోయాయి.తదుపరి టీడీపీ ఓడి పోవడం వైసీపీ అధికారంలోకి రావడం చక చకా జరిగిపోయింది.దాంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది.ఇక చేసేదిలేక సీపీఎం దళిత కూలీ రైతు సంఘం నేతలు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంవద్ద గిరిజనులతో వంటా వార్పుతో నిరసనకు దిగారు. స్పందించిన ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ చిన రాము నాయుడు కొత్తగా పదవి చేపట్టిన ఎమ్మెల్యే కడుబండి తరుపున వకాల్తా పుచ్చుకుని 6నెలల్లో అటవీశాఖ అనుమతులు పొందిపనులు ప్రారంబింప జేస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు.ఇంతలో అనూహ్యంగా కరోనా విజృంభించడంతో మారికరోడ్డు అంశం కాస్త ఆలస్యంకావడం ఎమ్మెల్యే కృషితో అటవీ శాఖ అనుమతులు రావడం పనులు ఏడాది క్రితం ప్రారంభించడం జరిగింది. మారికకొండ దిగువ భాగం నుంచి సుమారు 5కిలో పొడవునరోడ్డు ఫార్మేషన్ జోరుగా సాగింది.ఇంతలో పరిసర ప్రాంతాల్లో పులి సంచారం అని కొన్నాళ్ళు వర్షాలు పడుతున్నాయని కొన్నాళ్ళు సాకు చూపి పనులు పూర్తిగా నిలిపి వేశారు.ప్రస్తుతం పులి పాయే, వర్శమూ లేదాయే కానీ సంబందిత కాంట్రాక్టర్ జాడ మాత్రం కానరాలేదు.దాంతో సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. కళ్ళు చెవులు మూసుకున్న పాలకులను కడిలించెందుకు సీపీఎం నేత చల్లా జగన్ మళ్ళీ రంగంలోకి దిగక తప్పడం లేదు. ఇటీవల ఆయన మారిక గిరిశి ఖరం పైకి వెళ్లి గిరిజనులతో మమేకమై కార్యాచరణ రూపొందించారు.అధికారులు స్పందించకుంటే మార్చి ఒకటో తేదీ నుంచి ఎంపిడిఓ కార్యాలయంవద్ద వంటా వార్పు కార్యక్రమం చేపట్టనున్నట్లు హెచ్చరిస్తున్నారు. గిరిజనుల ఆందోళన కార్యక్రమం ఉద్యమం గా మారక ముందే మారికరోడ్డు పనులు శరవేగంగా జరిపి గిరిజనుల మౌలిక సదుపాయాలను మెరుగు పరిస్తే బాగుంటుంది.