వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు వేతన వెతలు ప్రారంభమయ్యాయి. జీతం చేతికి ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విడతలవారీగా జమ చేస్తుండడంతో కొందరి ఖాతాల్లో పడే సరికి నెల ముగిసిపోతోంది. కొన్నిశాఖల్లో పనిచేస్తున్న వారికి రెండు నెలలు గడిచి మూడో నెల ముగింపునకు వస్తున్నా ఇంకా వేతనం అందని పరిస్థితి ఏర్పడింది. పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని వారు అడుక్కోవాల్సి వస్తోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు వేతన వెతలు ప్రారంభమయ్యాయి. జీతం చేతికి ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విడతలవారీగా జమ చేస్తుండడంతో కొందరి ఖాతాల్లో పడే సరికి నెల ముగిసిపోతోంది. కొన్నిశాఖల్లో పనిచేస్తున్న వారికి రెండు నెలలు గడిచి మూడో నెల ముగింపునకు వస్తున్నా ఇంకా వేతనం అందని పరిస్థితి ఏర్పడింది. పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని వారు అడుక్కోవాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వంనుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగుల పరిస్థితి అందుకు అద్దం పడుతోంది.
ఉమ్మడి జిల్లాలో 230మంది ఉద్యోగులు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో 230మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో డీపీఎం 13మంది, ఏపీఎంలు 20మంది, సీసీలు 52మంది, హెచ్ఆర్లు 137మంది, ఎస్హెచ్ఆర్లు 32మంది, డ్వాక్రా ఈవోలు 9 మంది పనిచేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 109మంది, తూర్పుగోదావరి జిల్లాలో 45మంది, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 69మంది, డిప్యూటేషన్‌పై ఏడుగురు ఉన్నారు. వారంతా సెర్ప్‌లో అంతర్భాగమైన వైఎస్సార్ క్రాంతిపథం కింద పొదుపు సంఘాలకు సేవలందిస్తున్నారు. వీరు కాంట్రాక్టు ఉద్యోగులైనప్పటికీ సీఎంఎఫ్ఎస్ ద్వారానే ప్రతినెలా వేతనాలు చెల్లిస్తుంటారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. జీతాల చెల్లింపుల విషయంలో మితిమీరిన జాప్యం జరుగుతోంది. రెండునెలలుగా వీరికి చెల్లింపులు చేయకపోగా మూడోనెల మరో నాలుగు రోజుల్లో ముగియనుంది.
తప్పని ఎదురుచూపులు..
గతంలో ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగానే సెర్ప్‌లో పనిచేస్తున్న వారికి కూడా ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు అందేవి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాల చెల్లింపుల్లో ప్రతినెలా జాప్యం జరుగుతోంది. విడతలవారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. అలా కొందరికి జీతాలు అందే సరికి నెలలో మూడువారాలు గడిచిపోతోంది. సెర్ప్ ఉద్యోగులకు మాత్రం 84రోజులుగా జీతాలు చెల్లింపులు స్తంభించాయి. డిసెంబరు నెల వేతనం జనవరి 1న జమ చేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేసింది. కాస్తంత ఆలస్యంగానైనా జీతాలు పడతాయని సెర్ప్ ఉద్యోగులు భావించారు. కానీ సంక్రాంతికి కూడా జీతాలు పడలేదు. సెర్ప్ ఉద్యోగులంతా అప్పులు చేసి పండుగ చేసుకోవాల్సి వచ్చింది. అంతలోనే జనవరి ముగిసింది. ఆ నెల వేతనం కూడా ఇప్పటివరకూ అందని పరిస్థితి నెలకొంది. మరో నాలుగు రోజుల్లో మూడో నెల ముగుస్తున్నా అతీగతి లేకుండా పోయింది.2 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సెర్ప్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నారు. సెర్ప్ ఉద్యోగుల్లో అనేక మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. వారు ప్రతినెలా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. నిత్యావసర సరుకులు, ఇతరత్రా అవసరాలకు అవసరమైన వస్తువులు, మందులు అప్పుపై తెచ్చి జీతం వచ్చిన వెంటనే చెల్లిస్తుంటారు. దీనికితోడు ఇంటి నిర్మాణానికి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు ఉన్నారు. గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటారు. ప్రతినెలా నిర్ణీత తేదీల్లో బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సి ఉంది. గతంలో 1న వేతనాలు వారి ఖాతాల్లో జమ అయిన వెంటనే కిస్తీలు కట్టేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో బయట అప్పులు తెచ్చి ఈఎంఐలు, బ్యాంకు రుణాలు, ఇంటి అద్దెలు కడుతున్నారు. జీతం వచ్చిన వెంటనే చెల్లిస్తామని అప్పులు తెచ్చిన వారిపై రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. జీతాలు ఎప్పుడొస్తాయో తెలియక బాకీదారులకు కచ్చితమైన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. జీతం విడుదలైనా ఎన్నినెలలకు వస్తుందో, ఉన్న అప్పులు ఎంతవరకు సర్దుబాటు కాగలవోనని ఆందోళన చెందుతున్నారు. తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఫిబ్రవరి నెల కూడా చివరకు చేరుకున్నందున మూడు నెలల జీతాలు ఒకేసారి విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.