కార్యకర్తలే మా బలం..
వివేకాది ముమ్మాటికీ హత్యే
రాజకీయాలకు అడ్డు వస్తున్నారనే వివేకాను హత్య చేశారు
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తిగా విఫలం
‘మహానాడు’కు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతమైంది
రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపాదే విజయం
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
ఏలూరు,ఫిబ్రవరి 24 (ఆంధ్రపత్రిక) : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని భయంకరంగా హత్య చేసి.. ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు అనేక కుట్రలు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో సీబీఐ దర్యాప్తులో అన్నీ బయటకు వచ్చాయన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా జోన్-2 సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.‘’హత్యకు ముందు ఎంపీ అవినాష్ ఇంట్లో కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయాలకు అడ్డు వస్తున్నారనే వివేకాను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా ఎంపీ అవినాష్.. అమాయకుడని వైకాపా నేతలు చెబుతున్నారు. వివేకా ఎలా చనిపోయారో తెలియాలని.. అందుకోసం కచ్చితంగా శవపరీక్ష చేయాల్సిందేనని ఆనాడు ఆయన కుమార్తె సునీత పట్టు బట్టింది. తండ్రి హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఆమె.. పోరాడి కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారు. అయితే, వివేకా హత్యను తెదేపా నేతలపై నెట్టేందుకు ప్రయత్నించారు. వివేకా హత్యతో అవినాష్‌కు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. వివేకా హత్యకు ముందు అవినాష్ ఇంట్లో అందరూ కూర్చున్నారు. హత్య తర్వాత లోటస్ పాండ్‌కు ఫోన్ వెళ్లింది. ఇవన్నీ చూస్తుంటే.. వివేకాది ముమ్మాటికీ అంతఃపుర హత్యే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.‘’వైకాపా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఒంగోలులో తెదేపా నిర్వహించిన ‘మహానాడు’కు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతమైంది. ఇటీవల అనపర్తి వెళ్లకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి మరీ అడ్డుకున్నారు. అనపర్తి సభ మనలో స్ఫూర్తి రగిలించింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కందుకూరు తొక్కిసలాటను అడ్డంపెట్టుకొని జీవో.నం.1 తీసుకొచ్చారు. జగ్గంపేట, పెద్దాపురం సభలకు జనం భారీగా వచ్చారు. ప్రజల స్పందన చూసి అనపర్తి సభను అడ్డుకున్నారు. కార్యకర్తలే మా బలం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపాదే విజయం’’ అని చంద్రబాబు వెల్లడిరచారు.