నాటక ప్రదర్శన జరుగుతోంది. బాలిక వేషధారిణి అద్భుతంగా నటిస్తోంది. ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రేక్షకుల నుంచి ఒక వ్యక్తి ఉగ్రరూపంతో స్టేజీ పైకి ఎక్కారు. నటిస్తున్న అమ్మాయిని కొట్టటం ప్రారంభించారు. తన్మయులైన ప్రేక్షకులు నాటకంలో అదీ ఒక భాగమని భ్రమించారు. నటిస్తున్న అమ్మాయి విగ్గును పీకేయటంతో అసలు విషయం బయటపడిరది. ఆమె బాలిక కాదని, ఆడపిల్లవేషంలో ఉన్న పిల్లవాడని. వయసు సుమారు పదేళ్ళు. ఆడపిల్లవేషంలో నటిస్తూ, మెప్పిస్తూ దెబ్బలు తిన్న ఆ బాలుడు ఎదిగి నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా, పాత్రికేయునిగా చరిత్రలో నిలిచాడు. ఆ బాలుని పేరు రావి కొండలరావు. అతగాణ్ణి స్టేజీ మీద కొట్టిన మననీయుడు చిదం బరం. తపాలాశాఖలో ఉద్యోగి. రావి కొండలరావు తండ్రి. రావి కొండలరావు 1932 ఫిబ్రవరి 11న జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట వీరి జన్మస్థలం. తల్లి పార్వతమ్మ, తండ్రి చిదంబరం. వీరు తపాలాశాఖ ఉద్యోగి కావటం వల్ల తరచుగా బదిలీలు జరుగుతుండేవి. కొండలరావు పాఠశాల చదువు కాకినాడలో మొదలైంది. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళంలలో కొనసాగింది. శ్రీకాకుళంలో చదువుకునే రోజు ల్లోనే నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. వీలున్నప్పుడల్లా మగవేషాలు మాత్రమే కాదు, ఆడవేషాలు కూడా ధరించేవారు. స్కూలు నాటకాల్లో క్రమం తప్పకుండా నటించేవారు. తండ్రికి చెప్పి నటించితే మెచ్చుకునేవారు కాదు, చెప్పకుండా నటించితే చావు దెబ్బలు కొట్టేవారు. ఉద్యోగరీత్యా తండ్రి పొరుగూరులో ఉన్నారు. అప్పుడు ఒక నాటికలో ఆడవేషం వెయ్యవలసి వచ్చింది. వెనుకా ముందు ఆలోచించకుండా వేషం కట్టి నటిస్తున్నారు. నాటక ప్రదర్శన సమయానికి తండ్రి ఇంటికి రావటం, నాటకం తిలకించటానికి వెళ్ళటం, ఆడపిల్ల అద్భుతంగా నటిస్తున్నదని మెచ్చుకోవటం జరిగాయి. కొడుకును గుర్తుపట్టని చిదంబరం ‘‘ఆ బాలికెవరో బాగా నటిస్తున్నదే ‘‘ అని అనటం, ప్రక్కనున్న ప్రేక్షకుడు ‘‘అతడు మీ అబ్బాయే’’ అనటం, చిదంబరం ఉగ్రరూపం దాల్చి స్టేజీ పైకి ఎక్కి విగ్గు ఊడబెరికి కొడుకును గుర్తుబట్టి చితక్కొడుతూ వీధుల వెంట పరుగులు తీయించారట. అలా మొదలైంది కొండలరావు నాటక జీవితం.నటించటంతో పాటు రచనా వ్యాసంగం కూడా ఆయనకు బాల్యంలోనే అబ్బింది. అందుకు కారణం హిందూ మత ప్రచార సంస్థ. ఆ సంస్థ పట్ల కొండలరావుకు మంచి అభిమానం. దానిపైన నిషేధం విధించిన రోజుల్లో కూడా తన సన్నిహితులతో కలిసి ప్రదర్శన లిస్తుండేవారు. ఒక పర్యాయం కొండలరావును, అతని అనుయాయుల్ని పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైలులో వుంచారు. ఆ జైలు జీవితం వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దింది. జైలులో మంచి గ్రంథాలయం వుండేది. అనేక పుస్తకాలుండేవి. వాటిని చదవటం అలవాటు చేసుకున్నాడు. ఆ పఠనమే ఆయన్ని భాషావేత్తగా మార్చింది. రచయితగా, పాత్రికేయునిగా తీర్చి దిద్దింది. నాటకాలలో గళం వినిపిస్తూనే, ఖాళీ సమయాల్లో కలం కదిలించేవారు. చదువు పట్ల కన్నా ఇతర వ్యాపకాలపై ఎక్కువ శ్రద్ధ కనబరచేవారు. ఆయన రాసిన తొలి కథ ‘‘దైవేచ్ఛ’’. 1949లో ‘‘యువ’’ పత్రికలో అచ్చవటంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అటు తర్వాత ‘‘స్వయంవరం’’, ‘‘కుక్కపిల్ల దొరికింది’’, ‘‘కథ కంచికి’’, ‘పట్టాలు తప్పిన బండి’’, ‘‘ప్రొఫెస రు పరబ్రహ్మం’’ లాంటి నాటకాలను ప్రేక్షకులకు అందించారు. 1956లో ‘యువ’లో ‘కుక్కపిల్ల దొరికింది’ అచ్చయింది. పత్రి కారంగంలో కొనసాగుతూనే సినీరంగం వైపు దృష్టి సారిం చారు. 1953లో తెలుగు లోకి అనువదించబడిన మళయాళ చిత్రానికి స్క్రిప్ట్ రచయితగా అవకాశం అందిపుచ్చుకున్నారు. అటు తర్వాత డి.వి. నరసరాజుతో పరిచయం పొన్నలూరి బ్రదర్స్ సంస్థలో స్థానం కల్పించింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘‘శోభ’’ చిత్రం (1958)కు సహాయ దర్శ కునిగా పనిచేశారు. ఆ చిత్రంలో చిన్నపాత్ర ధరించి నటుడని పించుకున్నారు. అటు తర్వాత విడుదలైన ‘‘దాగుడుమూతలు’’, ‘‘ప్రేమించి చూడు’’ చిత్రాలలోని నటన వారిని నటునిగా గుర్తుంచుకునేలాచేసింది. మనిషికి రెండు కోణాలుంటాయం టారు. కాని కొండలరావుకు మూడు కోణాలున్నాయని వారి జీవిత సన్నివేశాలు స్ప ష్టం చేస్తుంటాయి. ‘దైవేచ్ఛ’ తో ఆయన రచనా ప్రక్రియ ప్రారంభమైంది. మళయాళ చిత్రానికి స్క్రిప్టు అందించి చిత్రరంగంలో కాలు మోపా రు. అవి రెండూ నిరంతరా యంగా కొనసాగిం చటంలో సిద్ధహస్తులనిపించుకు న్నారు. బాల్యంలో అలవడిన నాటకాభిలాష మాత్రం వారి నుంచి దూరంగా జరగలేదు. పాత్రికేయ, చిత్రరంగాలలో కొన సాగుతూనే నాటకాలను కూడా ప్రదర్శిస్తూండేవారు. రాజబాబు, కాకరాల, పొట్టి ప్రసాద్ వంటి వారు వీరికి సహచర రంగస్థల నటులుగా ఉండేవారు. ఈ మూడు అంశాలను కూలంకషంగా అవగతం చేసుకుని ముం దుకు సాగుతుండేవారు. ఆ రోజుల్లో ‘‘విజయచిత్ర’’ సినిమా పత్రిక పేరు వినని వారుండేవారు లేరు. అంతటి ఖరీదైన పత్రిక మరొకటి లేదు. ఆ పత్రిక సంపాదకవర్గ సభ్యునిగా 27 ఏళ్ళు బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందే ‘‘ఆనందవాణి’’, ‘‘ఆంధ్రపత్రిక’’, ‘‘ఆంధ్రజ్యోతి’’, ‘‘బంగారు పాప’’, ‘‘జ్యోతి’’ పత్రికల్లో కూడా వారి హస్తం ఉంది. పత్రికారంగంలో కొనసాగుతూనే చలనచిత్రరంగంలో కూడా మంచి గుర్తింపు పొందారు. 600కు పైగా చిత్రాలలో ఆయన నటించినట్లు చెపుతారు. తెలుగు పత్రికల్లో సినిమా కాలమ్స్ క్రమం తప్పకుండా కొనసాగించేవారు. ‘‘మల్లీశ్వరి’’, ‘‘మాయా బజార్’’,‘‘షావుకారు’’ సినిమాలకు నవలారూపం కల్పించారు. ‘‘అక్కినేని మనసులోని మాట’’, ‘‘చిత్తూరి నాగయ్య జీవిత చరిత్ర’’, ‘‘పాత బంగారం’’, ‘‘అన్నీ అడ్డంకులే’’, ‘‘హ్యూమ రథం’’ – 1,2భాగాలు అందించిన రావి కొండలరావు 2020 జూలై 28న స్వర్గస్తులయ్యారు.
– దాసరి ఆళ్వారస్వామి
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!