భారత నౌకాదళశక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి.
మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనం
భవిష్యత్తులో..ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసిపెడతాం
ముంబయి,డిసెంబరు 18 (ఆంధ్రపత్రిక): భారత నౌకాదళశక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావ్’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు.ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ మోర్ముగావ్ను భారత్లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధనౌకల్లో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలనూ తీర్చగలవు. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో.. ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసిపెడతాం’ అని మంత్రి అన్నారు.