సుస్థిరాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా
వృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢల్లీి,డిసెంబర్ 16 : ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.2024-25 నాటికి దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. సుస్థిరాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా వృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. 2030 నాటికి ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్ కీలక భూమిక పోషించబోతోందన్నారు. భారత్ తన దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు ఎగుమతులపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన బయో ఇథనాల్, బయో సీఎన్జీ, బయో ఎల్ఎన్జీ, గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రస్తుతం పనిచేస్తున్నామని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.7.5 లక్షల కోట్లుగా ఉందని, దీన్ని రూ.15 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. సిమెంట్, స్టీల్ వినియోగాన్ని తగ్గించి నిర్మాణ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించినట్లు గడ్కరీ తెలిపారు.