డిసెంబరు 17 నుంచి జనవరి 1 వరకు ‘బెంచ్’లు లేవు
న్యూఢల్లీి,డిసెంబర్ 16 (ఆంధ్రపత్రిక): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.ఈ ఏడాది శీతాకాల సెలవుల సమ యంలో సుప్రీంకోర్టులో ఎలాంటి బెంచ్‌లు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. డిసెంబరు 17 నుంచి జనవరి 1 వరకు రెండు వారాల పాటు సర్వోన్నత న్యాయస్థానానికి శీతాకాల సెలవులు ఉన్నాయి. ఈ సమయంలో సాధారణంగా వెకేషన్ బెంచ్‌లను ఏర్పాటు చేసేవారు. అయితే ఈ సారి జనవరి 1వ తేదీ వరకు సుప్రీంకోర్టులో ఏ బెంచ్‌లు అందుబాటులో ఉండవని జస్టిస్ చంద్రచూడ్ నేడు.. న్యాయమూర్తులకు వెల్లడిరచారు. తిరిగి 2023 జనవరి 2వ తేదీన సుప్రీంకోర్టులో సాధారణ కార్యకలాపాలు మొదలవుతాయని తెలిపారు.కోర్టుల సెలవులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న రాజ్య సభలో వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలకు సుదీర్ఘ సెలవులతో న్యాయం కోరేవారు అసౌకర్యానికి గురవుతున్నారనే భావన ప్రజల్లో ఉందని రిజిజు వ్యాఖ్యా నించారు. ఈ నేపథ్యంలో శీతాకాల సెలవుల్లో బెంచ్‌లు ఉండబోవంటూ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయ స్థానాలకు సెలవుల అంశం గతంలోనూ అనేకసార్లు చర్చకు దారితీసింది. దీనిపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ గతంలో ఓసారి మాట్లాడారు. న్యాయ మూర్తులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తూ.. సుదీర్ఘ సెలవులు తీసుకుని సౌకర్యవంతమైన జీవితాన్ని సాగిస్తున్నారని ప్రజల్లో అపోహ ఉందని ఆయన అన్నారు. కానీ అది నిజం కాదని, జడ్జీలు ఒక్కోసారి తమ తీర్పుల గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారని తెలిపారు. కేసుల అధ్యయనం కోసం వారాంతాలు, సెలవుల్లో పనిచేసి రోజులున్నాయని చెప్పారు.