ఈ గడ్డ ఇచ్చిన అండతోనే కాషాయ జెండా ఎగురేస్తున్నా
- విూరిచ్చిన ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నా
- కరీంనగర్ సభలో ఉద్వేగపూరిత ప్రసంగంలో బండి
- ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర
- కరీంనగర్ సభకు భారీగా హాజరైన జనం
- ముఖ్య అతిథిగా వచ్చి జెపినడ్డా, ప్రముఖులు
- తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటయ్యారు
- తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్
కరీంనగర్,డిసెంబర్15(ఆంధ్రపత్రిక): ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమయ్యారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘దోచుకుందాం.. కమీషన్లు దాచుకుందాం’ అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ప్రజలు తిరస్కరిస్తే ‘జై తెలంగాణ అని నేనంటా.. జై ఆంధ్రా అని నువ్వను’ అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల నాయకుల చరిత్రను ప్రజలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తాను చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కరీంనగర్ గడ్డ..భాజపా అడ్డా’ అని అన్నారు. ఈ నేలలో పౌరుషం ఉందని, ధర్మం కోసం పని చేయడమే తప్ప.. విజయం కోసం అడ్డదారులు తొక్కనని చెప్పారు. అవమానాలకు భయపడే వ్యక్తిని కాదని, కార్యకర్తలు, ప్రజల కష్టార్జితం వల్లే ఎంపీగా గెలిచానన్నారు. ‘’ నాకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. నా గెలుపుతో దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకానికి కరీంనగర్ కార్యకర్తలే కారణం. ప్రజలే అభిమానంతో గెలిపించారని మోదీ, అమిత్షా గుర్తించారు. కాషాయ జెండాతో రాష్ట్రాన్ని పవిత్రం చేయాలని భాజపా అధిష్ఠానం చెప్పింది’’ అని బండి సంజయ్ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీళ్లు, నిధులు,నియామకాలకు సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని బండి సంజయ్ తెలిపారు. కానీ, రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏమాత్రం సహకరించడం లేదన్నారు. ‘’ తెలంగాణ పేరుందని తెరాసకు 2 సార్లు ఓట్లు వేశాం. భారాస పేరుతో ‘తెలంగాణ’ పదాన్ని తొలగించారు. ఇకపై తెరాసకు తెలంగాణతో సంబంధం లేదు. ఇప్పటికే తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేశారు. భారాస పేరుతో కేసీఆర్ మరోసారి రాష్ట్రానికి మోసం చేస్తున్నారు. మద్యం పేరుతో దోచుకున్నారు. భూములు లాక్కున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖాళీలైన ఉద్యోగాల్లోనూ నియామకాలు చేపట్టలేదు. నోటిఫికేషన్లు ఇస్తారు.. కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారు. కేసీఆర్కు మళ్లీ అధికారం ఇస్తే మరో రూ.5 లక్షల కోట్లు అప్పు చేస్తారు. ధరణీ పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలని కేసీఆర్ చూస్తున్నారు.. ఆయనకు రాజకీయాలు తప్పితే.. ప్రజల సంక్షేమం పట్టదు’’ అని బండి సంజయ్ విమర్శించారు.