ఆస్పత్రుల వద్ద క్యూకడుతున్న జనం!
కొవిడ్ కేసులు వదిలిపెట్టడం లేదు
ఆందోళనల వెనుక విదేశీ హస్తం
బీజింగ్‌లో ఓ ఆస్పత్రి ప్రాంగణంలో టెస్టింగ్ కోసం క్యూలో నిల్చున్న ప్రజలు
బీజింగ్,డిసెంబర్ 15 (ఆంధ్రపత్రిక): చైనాను కరోనా వైరస్ వణికిస్తోంది.జీరో కొవిడ్ పాలసీకి స్వస్తి పలికిన తర్వాత అక్కడ భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. స్థానిక సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు అక్కడ పరి స్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిన రోజుల్లో భారత్ సహా పలు దేశాల్లో కనిపించిన దృశ్యాలే ఇప్పుడు అక్కడా కనిపిస్తున్నాయి.ఇన్నాళ్లూ జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో కేసులు బయటపడకుండా చూసుకున్న చైనా.. ప్రజల ఆందోళనలతో వెనక్కి తగ్గింది. కఠిన ఆంక్షలను సడలించింది. దీంతో 15 రోజులు తిరగకముందే ఆ దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం అక్కడ తన ప్రతాపం చూపిస్తోంది. బీజింగ్ సహా పలు ప్రధాన నగరాల్లో కొవిడ్ కేసులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆస్పత్రుల వద్ద తమ వంతు కోసం పేషెంట్లు క్యూ కడుతున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరైతే సెలైన్లతో కార్లలోనే వేచి చూస్తున్నారు. తీవ్రమైన జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో క్లినిక్కుల వద్ద నిల్చుంటున్న చిత్రాలూ బయటకొచ్చాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు, దౌత్య అధికారులు, జర్నలిస్టులు ఇలా ఎవర్నీ కొవిడ్ కేసులు వదిలిపెట్టడం లేదుఒకప్పుడు జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన నిబంధనలు అమలు చేసిన చైనా ప్రభుత్వం.. ఇప్పుడు దాదాపు వాటన్నింటికీ స్వస్తి పలికింది. ఎవరైనా ఒకరు వైరస్ బారిన పడితే ఆ వ్యక్తి సన్నిహితులను సైతం క్వారంటైన్‌కు తరలించేవారు. ఇప్పుడు చాలా వరకు క్వారంటైన్ సెంటర్లను మూసివేశారు. టెస్టింగ్ సెంటర్లను సైతం అక్కడి ప్రభుత్వం కుదించింది. డెల్టా వేరియంట్ తరహాలో ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అక్కడి ఎమిడమాలజిస్టులు చెబుతున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని స్థానిక అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఆందోళనల వెనుక విదేశీ హస్తం
జీరో కొవిడ్ పాలసీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని చైనాకు చెందిన ఓ దౌత్యాధికారి ఆరోపించారు. అంటువ్యాధిని అరికట్టడంలో స్థానిక అధికారులు విఫలమై ప్రజలు ఆందోళన చేస్తే ‘విదేశీ శక్తులు’ దాన్ని తమకు అనువుగా మార్చుకున్నాయని ఫ్రాన్స్‌లోని చైనా రాయబారి లు షాయ్ పేర్కొన్నారు. తొలి రోజు ఆందోళనలు మాత్రమే వాస్తవంగా జరిగాయని, రెండో రోజు నుంచి ఈ ఆందోళనల వెనుక విదేశీ శక్తులు కీలక భూమిక పోషించాయని ఆరోపించారు.