ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం
సిమ్లా,డిసెంబర్ 10 (ఆంధ్రపత్రిక): ఎట్టకేలకు హిమాచల్ సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వచ్చింది. తీవ్ర తర్జనభర్జనల తర్వాత పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సీఎం బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిర్ణయానికి నూతనంగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తాజా ఎన్నికల్లో 40 స్థానాలు సాధించి కాంగ్రెస్ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. కానీ, సీఎం పదవి ఎవరు చేపడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పీసీసీ చీఫ్, మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్ సీఎం పదవి కోసం తీవ్ర ప్రయత్నమే చేశారు. కానీ, చివర్లో రేసు నుంచి వైదొలిగారు. శాసనసభాపక్ష మాజీ నేత ముకేశ్ అగ్నిహోత్రిపేరు కూడా వినిపించింది, కానీ, అతడికి అధిష్ఠానం డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది.సుఖ్వీందర్ సింగ్.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013-2019 మధ్య కాలంలో హిమాచల్‌ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన సుఖ్వీందర్‌కు విద్యార్థి దశనుంచే రాజకీయాలపై మక్కువ ఎక్కువ. దీంతో కాంగ్రెస్ తరఫున నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1989లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1992-2002 మధ్య కాలంలో శిమ్లా మున్సిపల్ కార్పొరేషన్లో రెండు సార్లు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి 2008లో పీసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ ఎంపికయ్యారు. పార్టీలో కీలక వ్యక్తిగా మారిన సుఖ్వీందర్ సింగ్‌కు 2013లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించింది. తొలిసారిగా 2003 నాదౌన్ స్థానం నుంచి బరిలోకి దిగిన సుఖ్వీందర్.. ఆ తర్వాత 2007, 2017 ఎన్నికలతోపాటు తాజా ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. మరోవైపు కలబురిగి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. నూతన సీఎం, డిప్యూటీ సీఎంలు ఆదివారమే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.