సమైక్యాంధ్ర అంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసపూరితం
- ఏపీలో రైతు ఆత్యహత్యలు పెరగడం ఆందోళనకరం
- 1,673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్‌గా మారిపోయిన ఏపీ
- మద్దతు ధర లేకపోవడం, సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు కారణం
- ప్రజలపై ప్రభుత్వ వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి
- ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నోరెత్తని వైకాపా
- జగన్ పాలన వల్లే రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ
- ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తప్పులను సరిదిద్దుకోవాలి
- తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి, డిసెంబర్ 10 (ఆంధ్రపత్రిక): ఏపీలో రైతు ఆత్యహత్యలు పెరగడం ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా హయాంలో వ్యవసాయ రంగం, ఆక్వా ఎగుమతుల్లో రికార్డులు సృష్టించిన రాష్ట్రం..ఇప్పుడు మూడేళ్లలో 1,673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్‌గా మారిపోయిందని ఆరోపించారు. వైకాపా అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వారిన అప్పులపాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మద్దతు ధర లేకపోవడం, సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు కారణం అవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.ప్రజలపై ప్రభుత్వ వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని చంద్రబాబు దుయ్యబట్టారు. దీంతో నిస్పృహకు గురైన సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే వైకాపా ప్రభుత్వం వాటిపై దృష్టి సారించకుండా.. సమైక్య రాష్ట్రంపై ప్రకటనలు చేస్తోందని ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేసి సమస్యలను పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నోరెత్తని వైకాపా.. మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితమని విమర్శించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి.. రైతుల ఆత్మహత్యలు, ప్రజాసమస్యలకు కారణాలు విశ్లేషించాలన్నారు. సత్వర స్పందనతో ప్రణాళిక అమలుపరిచి అన్నదాతలకు అండగా నిలవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు