ప్రజలిచ్చిన అధికారానికి ద్రోహం చేసిన జగన్..
రాష్ట్రంలో క్షమించరాని తప్పులు చేసిన జగన్..
- రాష్ట్రం నుంచి కంపెనీలను వైకాపా తరిమేస్తోంది
- ఏపీలో ఉన్న పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న వైకాపా ప్రభుత్వం
- రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్ ప్రభుత్వం
- తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి,డిసెంబర్ 3 (ఆంధ్రపత్రిక): రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను, సామర్థ్యాన్ని నాశనం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ రెండిరటినీ చంపేసి వైకాపా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోందని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్విటర్లో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే, వైకాపా మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని ఎద్దేవా చేశారు. భూములను వెనక్కి తీసుకోవడం, దాడులతో వేధించడం, అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో ఏపీ ప్రతిష్టను రోజురోజుకీ దిగజారుస్తోందని విమర్శించారు. ప్రజలిచ్చిన అధికారానికి ద్రోహం చేసిన జగన్.. రాష్ట్రంలో క్షమించరాని తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి రూపంలో ఉన్న ఈ జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. రాయలసీమలో 4 దశాబ్దాల కాలంలో దాదాపు లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి రాష్ట్రానికే గర్వకారణంగా అమరరాజా సంస్థ నిలిచిందన్నారు. బిలియన్ డాలర్ కంపెనీ ఇప్పుడు తన సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి తెలంగాణకు తరలిపోయిందన్నారు. ఏపీలో ఉన్న పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని చంద్రబాబు మండిపడ్డారు.