గుజరాత్ ప్రభుత్వం
తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా:సుప్రీం కోర్టు
న్యూఢల్లీి,డిసెంబర్ 3 : గోద్రా రైలు దహనం కేసులో కొందరు దోషుల బెయిల్ పిటిషన్లను గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యతిరేకించింది.వాళ్లు రాళ్లదాడికి పాల్పడటం వల్లే దగ్ధమవుతున్న కోచ్ నుంచి ప్రయాణికులు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. 2002, ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పంటించడంతో ఎస్-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొందరు దోషులు తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్, జస్టిస్ పీ ఎస్ నరసింహా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.ఇప్పటికే వారు 17-18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినందున వారి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు.. దోషుల వ్యక్తిగత పాత్రలను పేర్కొనవలసిందిగా రాష్ట్రాన్ని కోరింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దోషులు చేసింది సాధారణ రాళ్లదాడి కాదని, వీరివల్ల బోగీలోని ప్రయాణికులు బయటకు రాలేకపోయారని కోర్టుకు వివరించారు.మరోవైపు దోషుల బెయిల్ పిటిషన్లు 2017 అక్టోబర్లో గుజరాత్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 11 మందికి విధించిన మరణ శిక్షను గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా వేసింది.