కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 8మంది పరిస్థితి విషమం
బల్లార్షా,నవంబర్ 26 (ఆంధ్రపత్రిక) : మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రాపూర్‌లోని బల్లార్షా రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ వంతెన కొంత భాగం కూలిపోయింది.ఈ ఘటనలో 20మందికి పైగా తీవ్ర గాయాలు కాగా.. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్‌ఫాం నుంచి వేరే ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ వంతెనపై నడుస్తుండగా అనేకమంది ప్రయాణికులు దాదాపు 60అడుగుల ఎత్తునుంచి కిందకు జారిపడ్డారు. ఈ ఘటనలోల పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. రైల్వేస్టేషన్‌లోని 1 నంబర్ ప్లాట్‌ఫాం నుంచి 4వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అందుబాటులో ఉన్న వాహనాల్లోనే తోటి ప్రయాణికులు, ఐఆర్సీటీసీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.