ఆస్తిపై అభద్రత ఉండకుండా పక్కాలెక్క
- వివాదాలకు తావులేకుండా భూముల సర్వే
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే
- మ్యుటేషన్, ల్యాండ్ సబ్ డివిజన్, హక్కు పత్రాలు సులభతరం
- స్థానిక సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు
- డిసెంబరు 2023 నాటికి 5 విడతల్లో భూహక్కు పూర్తి చేసి హక్కు పత్రాలు ఇస్తాం..
- భూముల విలువలు పెరగటంతో అక్రమాలు పెరిగిపోయాయి
- 90 శాతం భూ వివాదాల కేసులే
- సర్వే స్టాల్స్‌ను పరిశీలించిన సిఎం
- రైతులందరికీ వారి భూ హక్కు పత్రాలు అందిస్తాం
- జగనన్న శాశ్వత భూహక్కు`భూరక్షలో సిఎం జగన్
శ్రీకాకుళం,నవంబర్23(ఆంధ్రపత్రిక): ప్రజల ఆస్తులకు రక్షణ, భరోసా కల్పించటమే భూ సర్వే ఉద్దేశ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలకు తమ ఆస్తిపై అభద్రతా భావం ఉండకూడదన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే చేపట్టామని చెప్పారు. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మ్యుటేషన్, ల్యాండ్ సబ్ డివిజన్, హక్కు పత్రాలు సులభతరం అవుతాయన్నారు. రిజిస్టేష్రన్లు స్థానిక సచివాలయాల్లోనే జరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో ‘జగనన్న శాశ్వత భూహక్కు` భూరక్ష‘కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎంమాట్లాడుతూ… వైస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. డిసెంబరు 2023 నాటికి 5 విడతల్లో భూహక్కు పూర్తి చేసి హక్కు పత్రాలు ఇస్తామని తెలిపారు. భూముల విలువలు పెరగటంతో అక్రమాలు పెరిగిపోయాయన్నారు. భూ రికార్డులు సరిగా లేక పోవటంతో ప్రజలు పడుతున్న అగచాట్లు పాదయాత్రలో చూశానని ముఖ్యమంత్రి తెలిపారు.90 శాతం భూ వివాదాల కేసులు ఉన్నాయన్నారు. సరైన వ్యవస్థ లేకపోవటం వల్ల రికార్డులు ట్యాంపరింగ్ జరిగేవని చెప్పుకొచ్చారు. బుధవారం ఉదయం నరసన్నపేటలోని సభా వేదిక వద్దకు చేరుకున్న సిఎం ముందుగా సర్వే స్టాల్స్‌ను పరిశీలించారు. అధికారులతో వివరాలడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ జరగనుంది. జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభలో సిఎం జగన్ మాట్లాడుతూ … భూ సర్వే రికార్డుల ప్రక్షాళన అనే గొప్ప కార్యక్రమం రెండేళ్ల కిందట మొదలైందని, రైతులందరికీ వారి భూ హక్కు పత్రాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 2 వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని హర్షాన్ని వ్యక్తం చేశారు. 7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలు అందనున్నాయన్నారు. ఫిబ్రవరిలో రెండో దశలో 4 వేల గ్రామాల్లో సర్వే జరుగుతుందని తెలిపారు. మే 2023 నాటికి 6 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు అందుతాయని వివరించారు. ఆగస్ట్ 2023 నాటికి 9 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సిఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తి అవుతుందని అన్నారు. 80 శాతం నుంచి 90 శాతం సివిల్ కేసులు భూములకు సంబంధించినవేనన్నారు. రికార్డులు సరిగా లేకపోవడం, మ్యూటేషన్ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయని, ఎలాంటి సివిల్ వివాదాలు తావుండకూడదని అడుగులు ముందుకేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి కమతానికి నెంబర్ ఇస్తామని సిఎం జగన్ తెలిపారు. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నామని ప్రకటించారు. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ఆ పరిస్థితులు మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నా మన్నారు. భూ వివాదాలన్నింటికీ చెక్ పెడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతరం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్.. ఎన్టీఆర్.. జగన్ అంటారనీ, కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారని సిఎం ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు అని, అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమనాలి? అని ప్రశ్నించారు. భార్యతో సంసారం చేసే వారిని శ్రీరాముడు అంటామని.. పరాయి మహిళను ఎత్తుకెళ్లే వాడిని రావణుడు అంటామని.. మరి సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వారిని ఏమంటారని వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. సొంత మామను, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు ‘బాయ్ బాయ్ బాబు…. విూ సేవలు మాకొద్దు‘.. అని చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయాలు చెడిపోయాయని తెలిపారు. తాను దుష్ట చతుష్టయంను నమ్మకోలేదని… దేవుడి దయ, ప్రజలను నమ్ముకున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఐదేళ్లు జనసేన అధినేత పవన్,చంద్రబాబు సంసారం చేశారన్నారు. ఉద్దానంలో దత్త పుత్రులు పర్యటనలు చేశారని తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఉద్దానంకు మంచి నీరు అందించే చర్యలు చేపట్టామని అన్నారు. కిడ్నీ రోగులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడిరచారు. ఈ విషయంపై ఒడిస్సా సీఎంతో మాట్లాడినట్లు తెలిపారు. వంశధార ప్రాజెక్టు అడ్డంకులు అధిగమిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావుతదితరులు పాల్గొన్నారు. సర్వేతో పక్కా లెక్క