- అశ్రునయనాలు.అశేష జనవాహిని మధ్య అంతిమ సంస్కారం
- పోలీస్ గౌరవ వందనంతో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు
- కృష్ణకు సిఎం జగన్ ఘన నివాళి
హైదరాబాద్,నవంబర్ 16 (ఆంధ్రపత్రిక): అశేష జనవాహిని..అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. ఈ భూమితో బంధం తెంచుకున్న కృష్ణ తనవారందరికీ వీడ్కోలు చెప్పి దివికేగారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. మూడురౌండ్లు గాల్లో కాల్పులు జరిపి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ఘట్టమనేని కుటుంబ సభ్యుల అశ్రు నివాళుల మధ్య కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు నానక్ రామ్ గూడలోని పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్రను నిర్వ హించారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెలంగాణతో పాటు.. ఏపీ జిల్లాల నుంచి ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో నానక్ రామ్ గూడ, ఫిల్మ్ నగర్ ఏరియాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కడసారిచూపు కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి తీసుకువచ్చారు. కృష్ణకు వారి కుటుంబ ఆచారం ప్రకారం వైష్ణవ సంప్రదాయంలో నుదుటిన వైష్ణవ నామం పెట్టారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర మొదలవగా మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఘట్టమనేని అభిమానులు చివరిసారి తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలివచ్చారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి అభిమానుల జన సంద్రంలో కృష్ణ అంతిమయాత్ర జరిగింది. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే కృష్ణ గారి అంత్యక్రియలు జరి గాయి. తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తొలి సినిమా నుంచి సాహసమే తన ఊపిరి అనేలా సినిమాలు సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగు తెరకు సరికొత్త సాంకేతిక పరిచయం చేశారు కృష్ణ.స్టార్ హీరోగానే కాదు మంచి మనిషిగా కూడా కృష్ణ నిర్మాతలకు అండదండలు అందించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆ మంచి మనిషికి వీడ్కోలు పలికారు. నటుడు మురళీ మోహెన్ పాడె మోయడమే గాకుండా అంతిమాయాత్ర వెంట నడిచారు.
కృష్ణకు సిఎం జగన్ ఘన నివాళి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత కృష్ణకు ఘనంగా నివాళి అర్పించారు. పద్మాలయ స్టూడియోకు చేరుకున్న జగన్ సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మహేశ్ బాబును ఆలింగనం చేసుకుని తండ్రి పోయిన దు:ఖంలో ఉన్న అతనిని ఓదార్చారు. కృష్ణ పార్థివ దేహానికి నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మాలయా స్టూడియోకు చేరుకున్న ఆయన కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహేష్ బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సాహసాలకు, ప్రయోగాలకు మారు పేరని చెప్పారు. టాలీవుడ్ కు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. మొదటి కౌబాయ్ సినిమా, మొదటి సినిమా స్కోప్ సినిమా, మొదటి 70 ఎం.ఎం సినిమా,మొదటి డి.టి.ఎస్ సౌండ్ సిస్టమ్ మూవీ ఇలా చాలా టెక్నికల్ అంశాలను తెలుగు సినిమా పరిచయం చేశారని కొనియాడారు. నటుడిగానే నిర్మాతగా రాణించారని… పద్మాలయా స్టూడియోను స్థాపించారన్నారు. .సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో నటించారని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణ చెరగని స్థానం దక్కించుకున్నారన్నారు.