గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ,నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిన్నారులే దేశ భవిష్యత్తుకు కీలకమని విశ్వసించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారత తొలి ప్రధాని భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ 133వ జయంతి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరవ బిశ్వభూషణ్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూకు గులాబీలు, పిల్లలంటే చాలా ఇష్టమని, పిల్లలు తోటలోని మొగ్గల్లాంటి వారని, వారిని జాగ్రత్తగా, ప్రేమగా పెంచి పోషించాలని చెబుతూ ఉండేవారన్నారు. దేశ విద్యా రంగాన్ని రూపొందించడంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎంచదగినదని గవర్నర్ గుర్తు చేసారు. ఆధునిక భారతదేశ దేవాలయాలుగా పండిట్ నెహ్రూ పిలిచిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, వైజ్ఞానిక పరిశోధనా సంస్థలు, స్టీల్ ప్లాంట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఉన్నత విద్యాసంస్థల నిర్మాణానికి ఆయన తొలి ప్రధానిగా పునాదులు వేశారన్నారు. భూగోళాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నేటి విద్యార్ధులు, యువతపై ఉందని, నెహ్రూ స్మారకార్థం పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటడం ద్వారా బాలల దినోత్సవాన్ని జరుపుకోవాలని గవర్నర్ హరిచందన్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్, ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు